అమ్మకు తోడేమిటి అనే సందేహం మీకు కలగవచ్చు. అదేనండి.. నాన్న లేని అమ్మలకు తోడు వెతుకుతున్నారు నేటి యువతరం. వినడానికి విచిత్రంగా వున్నా, ఇది నిజమండి.. ఇంటి దగ్గర ఒంటరి జీవనం కొనసాగిస్తున్న అతివలకు.. వరుల్ని వెతికే పనిలో పడ్డారు.. వారి పిల్లలు.. ఏమిటి ఈ వింత పోకడలు అని కొంతమంది విమర్శించినా.. ఆధునిక యువత మాత్రం.. వీరికి అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి మద్దతు తెలుపుతుండటం విశేషం.

 

 

ఈ మధ్య కాలంలో జరిగిన రెండు కధలను మనం ఇక్కడ గమనించవచ్చు. పశ్చిమ బెంగాల్‌లోని హుగలీ జిల్లా చందన్‌నగర్ ఫ్రెంచ్ కాలనీకి చెందిన గౌరవ్ అధికారి అనే యువకుడు ఫేస్‌బుక్‌ వేదికగా... "మా తల్లిదండ్రులకు నేనొక్కడినే సంతానం. మా నాన్నగారు 2014లో చనిపోయారు. ఉద్యోగ రీత్యా నేను ఎక్కువ శాతం బయటే వుంటాను. రోజంతా మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఎవరికైనా ఒక తోడు ఉండాలని నేను నమ్ముతాను. అందుకే మా అమ్మకు తోడు కోసం వెతుకుతున్నాను" అని గౌరవ్ పోస్ట్ చేసాడు.

 

 

 

ఆస్తా వర్మ అనే యువతి, ట్విట్టర్ వేదికగా.. "మా అమ్మకు 50 ఏళ్ల వరుడు కావాలి. నాన్న లేని మా అమ్మకు తోడు నీడగా ఉండేందుకు ఓ మంచి మనిషి కావాలి. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి సుమా... ఆ వ్యక్తి అందంగా ఉండాలి, శాకాహారి అయ్యుండాలి, మద్యం అలవాటు అస్సలు ఉండకూడదు, జీవితంలో బాగా స్థిరపడిన వ్యక్తి అయి ఉండాలి.." అంటూ ఆమె కొన్ని షరతులు పెట్టడం ఇక్కడ కొసమెరుపు.

 

 

విమర్శల సంగతి అటుంచితే.. ఆ అబ్బాయి, అమ్మాయి చొరవని మనం మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే... భార్య/భర్త మరణం కారణంగా.. చాలా మంది చిన్న వయస్సులోనే ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తమ పనుల ఒత్తిడి కారణంగా పిల్లలు ఇంటిపట్టున ఉండి, వారిని జాగ్రత్తగా చూసుకోలేకతున్నారు. అలాంటప్పుడు జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టడం తప్పేమి కాదు...

మరింత సమాచారం తెలుసుకోండి: