కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తుండగా.. జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ బరిలో దిగుతున్నారు. బీజేపీ సొంత పార్టీ నేతలకే షాకిస్తూ.. క్షేత్రస్థాయి నేతల్ని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. సీఎం యడ్యూరప్ప నేతృత్వంలో రాష్ట్ర పార్టీ నేతలు సూచించిన పేర్లు పక్కనపెట్టి అందరికీ షాకిచ్చింది. 

 

కర్ణాటక రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయం విపక్షాలతో పాటు సొంత పార్టీకి కూడా షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితమే సీఎం యడ్యూరప్ప, రాష్ట్ర పార్టీ చీఫ్ నళిన్ కుమార్ నేతృత్వంలో హైకమాండ్ ను కలిసిన నేతలు.. మూడు పేర్లతో జాబితా ఇచ్చారు. రమేష్ కత్తి, ప్రకాష్ శక్తి, ప్రభాకర్ కోరె పేర్లు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే అధిష్టానం అనూహ్యంగా మూడు పేర్లనూ పక్కనపెట్టింది. కొత్త పేర్లు ఎంపిక చేసి రాష్ట్ర పార్టీకి పంపింది. క్షేత్రస్థాయి నాయకులైన ఎరన్న భీమప్ప, అశోక్ జాస్తి పేర్లు ఫైనల్ చేసింది. దీంతో విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. 

 

ఎరన్న భీమప్ప బెల్గాం రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. అశోక్ జాస్తి రాయచూర్ జిల్లాలో పార్టీ నేతగా ఉన్నారు. వీరిద్దరి పేర్లూ తమకు ఆశ్చర్యం కలిగించాయని కర్ణాటక బీజేపీ అధికార ప్రతినిధి బహిరంగంగానే చెప్పారు. అయితే క్షేత్రస్థాయి నేతల్ని గుర్తించాలన్న అధిష్ఠానం నిర్ణయం మంచిదేనన్నారు. అటు ఎరన్న భీమప్ప చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నా.. ఆయన్ను తాను ఒకటీ, రెండు సార్లకు మించి ఎప్పుడూ కలవలేదని సీనియర్ మంత్రి చెప్పారు. క్షేత్రస్థాయి నేతలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పడానికే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

కర్ణాటకలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా.. బీజేపీ ఇద్దరు అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది. కాంగ్రెస్ ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి, దళిత నేత మల్లికార్జున ఖర్గేను అభ్యర్థిగా నిర్ణయించింది. మరో సీటును జేడీఎస్ కు వదిలిపెట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. మాజీ ప్రధాని దేవెగౌడను బరిలోకి దిగమని కోరినట్టు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. జేడీఎస్ నేతలతో పాటు సోనియా విజ్ఞప్తి మేరకు.. దేవెగౌడ మంగళవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. గత జనవరిలో రాజ్యసభకు వెళ్లే ఆసక్తి లేదని చెప్పిన దేవెగౌడ పార్టీ కార్యక్రమాలకే పరిమితమౌతానని ప్రకటించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఒత్తిడితో అంగీకరించినట్టు తెలుస్తోంది. దేవెగౌడ బరిలోకి దిగకపోతే.. కాంగ్రెస్, జేడీఎస్ పరస్పరం పోటీపడి.. బీజేపీకి మేలు చేసే అవకాశం ఉండటంతో.. మాజీ ప్రధాని అంగీకరించక తప్పలేదు. ఈ నెల 19 న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు రాష్ట్రాల్లోని 18 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: