గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కేంద్ర అధికార పార్టీ బీజేపీ లోకి వెళ్తున్నారని, ఆమెకు అక్కడ కీలకమైన పదవి రాబోతుంది అంటూ కొద్దిరోజులుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని విజయశాంతి ఖండించక పోవడంతో, పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నా, ఆమె మౌనంగానే ఉండడం వంటి పరిణామాలతో ఆమె పార్టీ మార్పు నిజమేనని,  మరో ప్రచారం మొదలైంది. అంతేకాకుండా ఆమె కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు అని,  ఆమె బీజేపీ లో చేరితే సముచిత స్థానం ఇవ్వబోతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.



 దుబ్బాక ఉప ఎన్నికల తేదీకి ముందే ఆమె బీజేపీలో చేరతారు అంటూ హడావుడి నడుస్తోంది. అయితే ఈ విషయం పై  ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి రియాక్షన్ రాలేదు. తాజాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. విజయశాంతి పార్టీ మార్పు వ్యవహారం పై కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలే అంటూ క్లారిటీ ఇచ్చారు. తాను విజయశాంతి తో మాట్లాడాను అని, ఆమె పార్టీ మారడం లేదని చెప్పారని, కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని, అందుకే ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.



 అయితే ఇప్పటి వరకు విజయశాంతి మాత్రం ఎక్కడా ఈ విషయంపై స్పందించలేదు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్టు గా పరిస్థితులు ఉన్నాయి. వాటి ఫలితాలను బట్టి కాంగ్రెస్ కు రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అనే విషయం తేలిపోనుంది. ఇప్పటికీ కాంగ్రెస్ లో చాలామంది నాయకులు భవిష్యత్తు పై బెంగ పెరిగిపోతోంది. ఈ సమయంలో విజయశాంతి కనుక పార్టీ మారితే, కాంగ్రెస్ నుంచి వలసలు తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదు.ఇదే భయం ఉత్తమ్ వంటి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: