ఏపీలో మంత్రులని ప్రతిపక్ష పార్టీలు ఏదొరకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఏదొక అంశం మీద మంత్రులని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఇంకా పలు మంత్రులపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ని టీడీపీ గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

మొదట నుంచి ఆయనపై టీడీపీ నెగిటివ్ ప్రచారం చేస్తూనే ఉంది. అంతర్వేది రథం కాలిపోయిన విషయంలో, దుర్గ గుడిలో వెండి సింహాలు మాయమైన విషయంలో మంత్రిని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అలాగే పలు హిందూ దేవాలయాపై దాడులు జరగడంపై కూడా మంత్రిపైనే విమర్శలు చేశారు. అసలు నాన్-స్టాప్‌గా వెల్లంపల్లి టార్గెట్‌ని చేస్తూ రాజకీయం చేస్తున్నారు.

తాజాగా మంత్రిని కుల వివాదంలోకి లాగారు. తాజాగా టీడీపీకి చెందిన ఆర్యవైశ్యులు విజయవాడలోని ఓ హోటల్‌లో మీటింగ్ పెట్టుకున్నారు. సమావేశాన్ని ప్రారంభించక ముందే హోటల్‌లో సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వేరేచోట వారు సమావేశం పెట్టుకుని అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి వెల్లంపల్లిపై విమర్శలు చేశారు. వెల్లంపల్లినే సమావేశాన్ని అడ్డుకున్నారని మండిపడుతున్నారు. వైశ్యులను రెచ్చగొట్టేలా మంత్రి వెల్లంపల్లి వ్యవహరిస్తున్నారని, తుంగభద్ర పుష్కరాలు కూడా సరిగా నిర్వహించలేని వ్యక్తికి దేవాదాయశాఖ ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అంటే మంత్రికి తన సొంత సామాజికవర్గమే వ్యతిరేకమయ్యేలా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే జగన్ నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పారు. ఇక అప్పుడు మంత్రి వెల్లంపల్లి పదవి ఊడటం ఖాయమని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. అయితే మంత్రిని టీడీపీ వాళ్ళు కావాలనే టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నాయని, ఈ రాజకీయాన్ని ప్రజలు నమ్మరని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: