టీడీపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలోకి వెళ్ళాక చాలామంది నాయకులు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. పలువురు నేతలు పార్టీని వీడితే మరికొందరు పార్టీకి దూరంగా జరిగారు. అయితే కొందరు నేతలు నిదానంగా మళ్ళీ పార్టీలో కనిపించడం మొదలుపెట్టారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ టీడీపీ కనిపించడం లేదు. అలా అని వారు పార్టీని కూడా వీడలేదు. ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చుట్టూనే ఉన్న వియ్యంకులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.

గత ప్రభుత్వంలో వీరు మంత్రులుగా ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరుపున గెలిచారు. నారాయణ మాత్రం నెల్లూరు సిటీ నుంచి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అసలు ఓడిపోయిన దగ్గర నుంచి నారాయణ అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఏదో ఒకసారి మాత్రం అమరావతి విషయంలో బయట కనిపించారు.

ఇక తర్వాత నుంచి ఆయన కబడలేదు. తన వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నారాయణ టీడీపీకి దూరమయ్యారని తెలుస్తోంది. అలా అని పార్టీ మారకుండా అలాగే ఉన్నారు. అయితే మళ్ళీ ఎన్నికల సమయంలో ఉండే ఊపు బట్టి నారాయణ, ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించవచ్చని, అది కూడా టీడీపీతోనే ఉంటారని తెలుస్తోంది. ఇక నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచినా సరే యాక్టివ్‌గా ఉండటం లేదు.

ఈయన మొదట నుంచి పార్టీ మారిపోతారని ప్రచారం జరుగుతూనే ఉంది. అలా అని వైసీపీలోకి వెళ్లలేదు. టీడీపీలోనే లేరు. అయితే తాజాగా గంటా పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్‌లు శుభాకాంక్షలు చెప్పారు. అంటే గంటాని ఇంకా టీడీపీలో ఉండేలా చేయాలని బాబు చూస్తున్నారు. అయితే గంటా ఎప్పుడైనా బాబుకు షాక్ ఇవ్వొచ్చు. ఒకవేళ అలా కాదంటే ఎన్నికల సమయంలో అప్పుడు పరిస్థితిని బట్టి ముందుకెళ్లే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: