ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో సీఎం జగన్ భయపడిపోతున్నాడా.. అందుకే.. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్‌తో చెప్పిస్తున్నారా.. ఎన్నికలు పెడితే ఓడిపోతామని జగన్ భయపడుతున్నారా.. అవునంటున్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులు, పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.

జగన్ ఓటమి భయంతోనే ఎన్నికలకు వెనుకంజ వేస్తున్నాడని.. తెలుగుదేశం అధినేత అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్న చంద్రబాబు..., ఆన్ లైన్ లో కూడా నామినేషన్లు తీసుకోవాలని సూచించారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని డిమాండ్‌చేశారు. గ్రామవాలంటీర్లు ఎవరినీ ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించరాదని స్పష్టంచేశారు. గతంలో ఎలక్షన్ కమిషన్ సిఫారసు చేసిన అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తేల్చిచెప్పారు. ప్రభుత్వ భవనాలపై వైకాపా రంగులను తక్షణమే తొలగించడంతోపాటు గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు. మళ్లీ అన్ని స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతే కాదు.. అసలు స్థానిక ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి సంస్థ అన్న ఆయన... దాన్ని నియంత్రించడానికి ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నించారు. సీఎం తన తాబేదారులతో స్థానిక ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల ఎన్నికలు పూర్తయ్యేదాకా ముఖ్యమంత్రి ఇంటికే పరిమితమం కావాలంటున్నారు.

పనిలో పనిగా తన పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.. వైకాపా నాయకులకు ఎవరూ భయపడాల్సింది లేదన్నారు. పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తూ  గ్రామాలు, వార్డులలో శాంతిభద్రతలను  కాపాడాలని కోరారు. అవసరమైతే తానూ క్షేత్రస్థాయి పర్యటనకు వస్తానన్న చంద్రబాబు... ఎక్కడ ఎటువంటి దాడి దౌర్జన్యం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన చూస్తున్నామని  చంద్రబాబు ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: