జీహెచ్ఎంసీకి కొత్త మేయర్ వస్తారా లేక కొంత కాలం ప్రత్యేక ఆఫీసర్ పాలనలో ఉంటుందా అన్న అనుమానాలకు తెర పడింది. గ్రేటర్ హైదరాబాద్ కొత్త పాలకమండలి కొలువు దీరేలా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. అనంతరం 12.30 నిమిషాలకు మేయర్ ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు. ఎన్నికల పర్యవేక్షణకు ఐఏఎస్ స్థాయి అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. ఏదైనా కారణాలతో ఎన్నిక నిర్వహించలేని పక్షంలో ఫిబ్రవరి 12న ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి 18 వరకు గడువుంది. దీంతో ఆలోపే కొత్త మేయర్. డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయ్యేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.


    జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబర్ 1న  ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.  పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన పతంగి పార్టీ 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ నెలకొంది.
జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. అయితే ప్రస్తుతం బల్దియాలో ఎంతమంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో గతంలో టీఆర్‌ఎస్‌కే ఎక్కువ మంది ఉన్నారు. అయితే 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొంత మంది ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో గతంలో కంటే అధికార పార్టీకి ఎక్స్ అఫీషియో సభ్యులు తగ్గారని తెలుస్తోంది.

టీఆర్ఎస్‌కు బీజేపీ ఎలాగూ మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ పీఠం కోసం టీఆర్ఎస్, ఎంఐఎంలు చేతులు కలపడమో లేక టీఆర్ఎస్‌కు ఎంఐఎం బయటి నుంచి మద్దతు ఇవ్వడమో జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: