కరోనా వైరస్ వలన దేశమంతా నాశనం అయిపోతుంటే ... ఏపీలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి సాధారణంగా అధికార ప్రతి పక్ష పార్టీల నడుమ మనము ఎక్కువగా వివాదాలు లేదా ఘర్షణలు చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం వైసీపీలో అంతర్గతంగా కొందరు నాయకులు ఒక దగ్గర చేరి ప్రభుత్వం గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఉదయం నుండి వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో ఉన్న వారందరూ వైసీపీ నాయకులే, వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, రౌతు సూర్యప్రకాష్ ఆకుల సత్యనారాయణ మరియు మార్గాని భరత్ ఉన్నారు . ప్రస్తుతం ఈ వీడియో గురించి రాష్ట్రమంతా రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వీడియోలో అసలు ఏముంది అంటే, ప్రభుత్వం పూర్తిగా లాజిస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురాలేదంటూ వీరు మాట్లాడుతున్నారు.

ప్రత్యేకంగా హాస్పిటల్స్ లో ఈ లాజిస్టిక్స్ లేకపోవడం వలన ఒక రోజుకి సుమారుగా 100 మంది వరకు కరోనాతో చనిపోతున్నారని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్న ధోరణిలో వారి సంభాషణ ఉంది. అంతే కాకుండా పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజమండ్రి ప్రాంతంలో రోజుకి 100 మంది వరకు చనిపోతున్నారని చెబుతున్నట్లు ఉంది. మరో వైపు ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసింది అని విమర్శ చేశారు. అంతే కాకుండా ఇప్పుడే ఏమైంది ఇంకో వారంలో ఇంతకు మించి నష్టం జరిగిపోతుందని ఆకుల సెటైరికల్ గా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఒక శవాన్ని తీసుకెళ్లడానికి 12 నుండి 15 వేల రూపాయలు తీసుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈ చర్చలో తీసుకువచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితిలో ఉందని కూడా ఆకుల సత్యనారాయణ అనడం కొసమెరుపు. ఈ వీడియోను కనుక నిశితంగా పరిశీలిస్తే వైసీపీలో అంతర్గతంగా వారిలో వారికే ఉన్న ఘర్షణల కారణంగా ఈ వీడియోను కావాలనే సర్క్యూలేట్ చేశారు అనే సందేహాలు వస్తున్నాయి.

వీరు నలుగురు ఒక చర్చలో ఉన్నప్పుడు ఆ వీడియో బయటకు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఇంటరెస్టింగ్ పాయింట్. దీన్ని చూస్తుంటే అనంతపురంలో కేతిరెడ్డి కూడా పబ్లిక్ లో తిరిగేటప్పుడు వీడియోలను తీసుకుంటూ ఉంటారు. అదే విధంగా మార్గాని భరత్ కూడా ఈ మధ్య ఏ కార్యక్రమాలు చేసినా వీడియోలను తీసుకుంటున్నారు. ఆ తరువాత సామాజిక మాధ్యమాలలో టెలికాస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వినపడుతున్న సమాచారం ప్రకారం పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు ఆకుల సత్యనారాయణలు అంటే తోట త్రిమూర్తులుకి పడకపోవడం వల్లనే వారిని టార్గెట్ చేయడం కోసం...పిల్లి వ్యతిరేక వర్గమంతా ఈ తతంగాన్ని నడిపారు, అందుకోసం మార్గాని భరత్ ను ఉపయోగించారు అన్నది ఒక సందేహం. అంతే కాకుండా వీడియో చివరన మార్గాని భరత్ ఆపు అని అనడంతో ఈ సందేహం మరింత బలపడుతోంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ లో ఉన్న అంతర్గత వివాదాలు ఇంకెంతదూరం వెళ్లనున్నాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: