వెండితెరపై విశ్వకథానాయకుడిగా పేరుగాంచిన కమల్‌హాసన్ రాజకీయ తెరపై తన ప్రభావాన్ని చూపించలేకపోయారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించడంద్వారా ప్రజలకు సరికొత్త రాజకీయాన్ని, అభివృద్ధిలో కొత్త పాఠాలను నేర్పుతానన్న కమల్ ఓటమిపాలవడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన కమల్ భారతీయ జనతాపార్టీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1728 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
పార్టీ ఉంటుందా? లేదా?
కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ఉంటుందా? లేదా? అనే సందేహం ఇప్పుడు ఆయన అభిమానులనే కాకుండా తమిళనాడు ప్రజలందరినీ వేధిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కమల్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీ నేతలంతా వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఎంఎన్ఎం ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ తన పదవికి రాజీనామా చేయడంతోపాటు కమల్‌పై తీవ్ర విమర్శనాస్త్రాలు గుప్పించారు. పార్టీ అనేది అభిమాన సంఘం అసోసియేషన్‌లా మారిపోయిందని, ప్రజాస్వామ్యం లేదని, పోల్ మేనేజ్మెంట్ కంపెనీలా ఎంఎన్ఎం మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు.
ప్రజలవద్దకు వెళ్లాలి
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన వెంటనే పవన్ కల్యాణ్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేశామని, 10 పైసలు ఖర్చుపెట్టకుండా జనసేన ఎన్నికల్లో నిలబడిందని, తాను ఓటమిపాలైనా ఒక్క సీటును గెలుచుకోగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో అధికారాన్ని సాధించే స్థాయికి చేరతామని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామంటూ జనసేనాని ప్రకటించారు. పవన్ ను చూసి కమల్ చాలా నేర్చుకోవాలని, మౌనం వీడాలని, గతంలో విజయ్‌కాంత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినట్లు కమల్ కూడా పోరాటస్ఫూర్తిని ప్రదర్శించాలని, ఏపీలో పవన్‌కల్యాణ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లశాతం అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరిగా పూర్తిగా తగ్గిపోయిందని, ఇలా ఎందుకు జరిగిందో, నేతలంతా పార్టీని ఎందుకు వీడుతున్నారో ఒకసారి కమల్‌హాసన్ విశ్లేషించుకోవాలని, పార్టీ కార్యవర్గాన్ని పునరుద్ధరించుకొని ప్రజల పక్షాన పనిచేయాలనే విశ్లేషణలు అన్నివైపులా వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి