తెలంగాణ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్‌ ను బాగా ఉపయోగించే రాజకీయ నేతల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు. ఆయన పేరిట రెండు, మూడు ట్విట్టర్ ఖాతాలు ఉంటాయి. వాటిని ఆయన కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. ఇప్పుడు కరోనా సమయంలోమంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ కు ట్రాఫిక్ ఫుల్లుగా పెరిగింది. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి కుటుంబీకులు, సన్నిహితుల నుంచి మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తులు జోరుగా వస్తున్నాయి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు కావాలంటూ సాయం కోసం చాలా మంది కేటీఆర్ ట్విట్టర్ ఎకౌంట్‌ను ఆశ్రయిస్తున్నారు.

మంత్రి కార్యాలయం కూడా ఈ విజ్ఞప్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తోంది. కేవలం తెలంగాణ నుంచే కాకుండా వివిధ పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కేటీఆర్ ట్విట్టర్‌కు విజ్ఞప్తులు వస్తుంటాయి. కొందరు కరోనా సేవలపై కూడా మంత్రి ట్విట్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అలాంటి వాటిపైనా మంత్రి కార్యాలయ సిబ్బంది స్పందిస్తున్నారు. ఉదాహరణకు  ఖమ్మంకు చెందిన ఒక రోగి బంధువు ఆసుపత్రిలో భారీగా రుసుం అడుగుతున్నారని కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు.

కేటీఆర్ సూచన మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చేసరికి అంతా సెట్ రైట్ అయ్యింది.  ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, అంబులెన్స్‌లో ఇంటికి పంపిస్తామన్నారని రోగి బంధువు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్‌లో ఓ రోగి కూతురు అధిక ఫీజులపైనే ఫిర్యాదు చేశారు.  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తన తండ్రిని రూ.లక్ష చెల్లించి చేర్పించానని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రతి రోజు రూ.లక్ష కట్టాలంటున్నారని  మొరపెట్టుకున్నాడు. దీంతో మంత్రి కేటీఆర్ వైద్యశాఖ కార్యదర్శి రిజ్వికి పంపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేటీఆర్ ట్విట్టర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ఝార్ఖండ్‌లో ఓ మహిళ విషమ పరిస్థితిలో ఉందని హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించే అవకాశం ఉంటే ఆమెను హెలికాప్టర్‌లో తరలించడానికి సిద్ధంగా ఉన్నారని శ్రవణ్‌ అనే వ్యక్తి కోరాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌సొరెన్‌కు ఆ వినతిని పంపి తగిన ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ కోరారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: