
గతేడాది కరోనా సమయంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సుధాకర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై హైకోర్టులో కేసు నడిచింది. కోర్టు కూడా సీబీఐతో విచారణ జరిపించి ఆయనకు సంబంధించిన ఫిర్యాదులపై నివేదిక సమీకరించింది. ఈ తరుణంలో డాక్టర్ సుధాకర్ కన్నుమూయడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ మృతి పట్ల టీడీపీ నాయకుడు లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సుధాకర్ మృతి నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని, మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా జగన్ ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసిందన్నారు. ఇది గుండెపోటు కాదు. ప్రశ్నించినందుకు ప్రభుత్వం చేసిన హత్య ఇదంటూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సుధాకర్ మరణానికి జగన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాడు.
లోకేశ్ ట్వీట్‌కు వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. వాడుకొని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు మాటలకు మోసపోయి డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతిచెందాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి ట్వీట్ చేశాడు. నీకెందుకు నేనున్నా రెచ్చిపో అంటాడు చంద్రబాబు, మీడియా ముందు పులి వేషాలెయ్యమంటాడు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు పొడుస్తాడు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి డాక్టర్ సుధాకర్ వరకు అంతే. చంద్రబాబు లిస్టులో ఇంకెంతమంది ఉన్నారో? అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వైసీపీ శ్రేణులు మద్దతు పలుకుతుండగా, టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఏపీలో కరోనా భయపెడుతున్న వేళ సోషల్ మీడియా వేదికగా వార్ సాగుతుంది.