
అంతే కాకుండా ఈ ఏపిపిఎస్సి నిర్వహణ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని వీటన్నింటిపై గవర్నర్ కున్న ప్రత్యేక అధికారాలతో సరిచేసి ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు లోకేష్. గడిచిన రెండు సంవత్సరాల నుండి ఏపిపిఎస్సి లో రాజకీయ వ్యక్తుల చొరవ ఎక్కువ అయిందని, ఆ కారణంగానే గ్రూప్ 1 కు చెందిన అభ్యర్థులు న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విన్నవించుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించిన మెయిన్స్ ఎగ్జాం గత డిసెంబర్ లో నిర్వహించారు. ఫలితాలు ఈ ఏప్రిల్ లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా 7000 మంది అభ్యర్థుల్లో కేవలం 340 మంది మాత్రమే ఇంటర్వ్యూ కు సెలెక్ట్ అయ్యారు. దీనిపై అభ్యర్థులకు చాలా అనుమానాలున్నట్లు లోకేష్ తెలిపారు. ఇలా జరగడానికి కారణం వారు అవలంభించిన డిజిటల్ వేల్యూషన్ అని గట్టిగా చెప్పారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో ఈ డిజిటల్ వేల్యూషన్ గురించి ఎటువంటి విషయాన్ని ప్రస్తావించకపోగా, దీనిపై ముందస్తుగా ఏ విధమైన వివరాలను తెలుసుకోకుండా అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలాడారని చెప్పుకొచ్చారు.
ఎంతో కటినమైన యుపిపిఎస్సి లాంటి పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైతం ఏపిపిఎస్సి లో అర్హత సాధించకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. ఈ విషయంపై ఉన్న అనుమానాలకు వివరణ కోసం ఎంతోమంది అభ్యర్థులు సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించగా అక్కడ వారికి సరైన వివరణ ఇవ్వకపోగా అందరికీ ఒకే రకమైన సమాధానం ఇవ్వడంతో అనుమానాలు ఇంకా బలపడ్డాయి. పైగా ఇందులో ఎంపిక కాబడిన 340 మంది అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియపరచలేదు. ఎప్పటిలాగే వేల్యూషన్ మ్యాన్యువల్ పద్దతిలో చేయకపోవడం వలనే ప్రతిభ ఉండి, అర్హత కాగలిగే సత్తా ఉండి కూడా డిస్ క్వాలిఫై అయ్యారు. వీటన్నింటికీ ఒక పరిష్కారం దొరకాలంటే ఏపిపిఎస్సి డిజిటల్ వ్యాల్యుయేషన్ కి సంబంధించిన శ్వేతపత్రాన్ని వదలాలి అని అంటున్నారు. మరి ఈ లెటర్ పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సిన ఉంది.