దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆన్ లైన్ బోధన జోరుగా సాగుతోంది. ఒడిశా ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 10 తరగతి విద్యార్థులకు యూట్యూబ్ లో పాఠాలు ఉంచుతోంది. ఏరోజు పాఠం ఆరోజు చదివేలా సూచనలు చేస్తోంది. అయితే ఒడిశాలో సెల్ ఫోన్ సిగ్నల్ కష్టం. అందులోనూ గిరిజన గ్రామాలకు అసలు సరైన కనెక్టివిటీ లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా లేకపోతే.. వారంతా హాస్టల్స్ లో ఉంటూ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునేవారు. ఇప్పుడు ఆన్ లైన్ క్లాసులంటే సెల్ ఫోన్ సంపాదించడమే కష్టంగా మారుతోంది. దానికి తోడు సిగ్నల్ దొరకడం మరింత కష్టమైపోయింది.
సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం గిరిజన విద్యార్థులు గుంపులు గుంపులుగా పక్క ఊళ్లకు వెళ్తున్నారు. కొంతమంది ఏకంగా రాష్ట్రాల సరిహద్దులే దాటాల్సిన పరిస్థితి. కొంతమంది జార్ఖండ్ లో, మరికొంతమంది ఏపీ బోర్డర్ దాటి ఇటువైపు వస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ దొరకగానే పాఠాలు డౌన్ లోడ్ చేసుకుని ఇంటిబాట పడుతున్నారు.
ఇప్పటి వరకూ మనం సిగ్నల్ కోసం చెట్లెక్కినవారిని, కొండలెక్కినవారిని చూశాం. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాలు దాటి పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టేవారి గురించి వింటున్నాం. కరోనా కష్టకాలంలో ఆన్ లైన్ బోధన విద్యార్థులకు లేనిపోని కష్టాలను కొనితెచ్చింది. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులు, మారుమూల ప్రాంతాల్లో నివశించేవారి బాధలు వర్ణనాతీతం. సాంకేతికత అందుబాటులో ఉన్న ఉన్నతాదాయ వర్గాలతో వీరు పోటీ పడలేకపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి