
విజయవాడ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దేవాలయం, ఆ తర్వాత గలగలా పారుతున్న కృష్ణమ్మ. కుటుంబ సమేతంగా కాసేపు సరదాగా గడిపేందుకు కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్. ఇంతకు మించి మరే ప్రదేశం కూడా ప్రస్తుతం విజయవాడ వాస్తవ్యులకు అందుబాటులో లేవు. హైదరాబాద్ తో పోలిస్తే... కేవలం ఒక్క శాతం మాత్రమే ఇక్కడ ఎంటర్ టైన్ మెంట్ అనే చెప్పాలి. ఇందులో కూడా భవానీ ఐలాండ్ ను ఇప్పుడు అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గోదావరి బోటు ప్రమాదం జరిగిన తర్వాత... రాష్ట్రంలో పర్యాటక రంగంలో మార్పులు తీసుకువస్తామని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం... దాదాపు ఆరు నెలల పాటు బోటింగ్ ను ఆపేసింది. దీంతో... అటు గోదావరిలో, ఇటు కృష్ణా నదిలో బోటింగ్ నిలిచిపోయింది. ఇక అంతే భవానీ ఐలాండ్ కు పర్యాటకుల తాకిడి లేకపోవడంతో... అంతా బోసిపోయింది. దీంతో ఏదో కాసేపు అలా వచ్చి పున్నమి ఘాట్ లో కూర్చుని వెళ్లిపోతున్నారు విజయవాడ నగర వాసులు. అంతకు ముందు ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ వద్ద కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద నిత్యం హారతి కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. అలాగే ఫెర్రీ వద్దకు ఎవరినీ రానివ్వటం లేదు కూడా. అటు ఫెర్రీ లేదు... ఇటు భవానీ ఐలాండ్ లేదు. ఇక ఎప్పుడో ఆగిపోయిన రాజీవ్ గాంధీ పార్క్ సంగతి సరే సరి. అది ఒకటి ఉందనే విషయం కూడా నగర వాసులు మర్చిపోయారు. దీని మరమ్మతు కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలియటం లేదు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే... కాసేపు సరదాగా బయటకు వచ్చిన ప్రజలు... వెళితే ఏదైనా షాపింగ్ మాల్... లేదంటే హోటల్... అంతే తప్ప.. కనీసం ఎంటర్ టైన్ మెంట్ అంటే కూడా తెలియటం లేదు. మరీ విచిత్రం ఏమిటంటే... ఏ దిక్కు లేనట్లుగా దుర్గ గుడి ఫ్లై ఓవర్ మీదకు వచ్చి... రోడ్డుపై కాసేపు ఆగి... సెల్ఫీలు తీసుకుని ఆనందపడుతున్నారు. ఇప్పటికైనా విజయవాడ వాసుల కోసం ఓ పార్క్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే భవానీ ఐలాండ్ ను తిరిగి ప్రారంభించాలని కూడా నగర వాసులు కోరుతున్నారు.