అసెంబ్లీ సమావేశాలు ఏ రాష్ట్రంలో ప్రారంభమైనా తొలి రోజు అక్కడ తన హాజరు చూపించి ఏవో కొన్ని వ్యాఖ్యలు చేయకపోతే ఆయ‌న జేసీ దివాకర్ రెడ్డి అవ‌రు. మనసు కూడా ఊరుకోదు. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకావడంతో తొలి రోజే ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించి ఆస‌క్తిని రేకెత్తించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు. ఎం మాట్లాడారో కానీ తాము తెలంగాణను విడిచిపెట్టి తప్పు చేశామని జేసీ బాధపడ్డారు.

జైపాల్‌రెడ్డి ప‌డ‌నీయ‌లేదు
తెలంగాణ ఉద్యమం సమయంలోనే రాయల తెలంగాణ కావాలనికోరుకున్నా జైపాల్ రెడ్డి పడనీయలేదన్నారు. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు అస‌లు ఏమీ బాగోలేవని.. తెలంగాణలో మాత్రం చాలా బాగున్నాయన్నారు. గతంలో అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చి నాగార్జునసాగర్‌లో జానారెడ్డి ఓడిపోతారని జేసీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయంపై మీడియాలో  చర్చ జరిగింది. దీనిపై హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కాంగ్రెస్ నేతలు జేసీతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. సీఎల్పీకి వచ్చి కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మాట్లాడకూడదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించడంతో జేసీ ఆయ‌న్ను క్ష‌మాప‌ణ‌లు కోరారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని ..కానీ హుజురాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటో తనకు తెలియదని జేసీ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ‌కు వ‌స్తా
జేసీ దివాకర్ రెడ్డి తాము తెలంగాణకు వస్తామని చెప్పడం అంటే రాజకీయంగా ఇక్కడకు వస్తామని చెప్పడమేనంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కానీ అలాంటి పరిస్థితే లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. జేసీ నాన్ సీరియస్ కామెంట్స్ చేశారని,  కేసీఆర్, కేటీఆర్‌తో సమావేశం కావడంతో జేసీ రాజకీయ గుట్టు ఏదో ఉండి ఉంటుందని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే అవేమిట‌నేది త్వ‌ర‌లోనే ఒక స్ప‌ష్ట‌త రావొచ్చంటున్నారు. ఒక‌వేళ తలంగాణ నుంచి పోటీచేస్తే నియోజ‌క‌వ‌ర్గం ఎక్క‌డ‌? ఏంపీగా పోటీచేయాలా? ఎమ్మెల్యేగా పోటీచేయాలా? అనేదాంట్లో కూడా ఒక స్ప‌ష్ట‌త రావాలి. అప్ప‌టివ‌ర‌కు జేసీ సోద‌రుల రాజ‌కీయ లోగుట్టు పెరుమాళ్ల కెరుక‌..!!


మరింత సమాచారం తెలుసుకోండి: