ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్.. అవంతి శ్రీనివాస‌రావు  విష‌యం..త‌ర‌చుగా.. వార్త‌ల్లోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్య‌వ‌హారం ఎప్పుడూ.. హాట్ టాపిక్‌గానే న‌డుస్తుంటుంది. తాజాగా ఆయ‌న అనుచ‌రులు.. మ‌రో వాదాన్ని తెర‌మీద‌కి తెచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజారిటీ కంటే.. భారీ మెజారిటీతో గెలిచి.. మాజీ మంత్రి గంటాకు మా నేత‌.. షాకిస్తారు! అనివారు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. మంత్రి అవంతి ప్ర‌స్తుతం భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

అయితే.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన నాయ‌కుడు, మాజీ ఎంపీ స‌బ్బంహ‌రిపై విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. కేవ‌లం.. 9 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీనే సాధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నూ తాను ఇక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని.. భారీ మెజారిటీ ద‌క్కించుకుంటాన‌ని.. ఇటీవ‌ల త‌ర‌చుగా.. మంత్రి అవంతి ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నారు. అయితే.. ఇదేదో రాజ‌కీయం గా.. చేసే కామెంటే క‌దా.. అనుకున్నారు అంద‌రూ. కానీ, అవంతి వ్యాఖ్య‌ల వెనుక చాలా వ్యూహం ఉంద‌ని అంటున్నారు. భీమిలిలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. మంత్రిగా గ‌తంలో ప‌నిచేసిన గంటా శ్రీనివాసరావు కు వ‌చ్చిన మెజారిటీ.. ఎవ‌రికీ రాలేదు.

వ‌రుస‌గా జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లో రెండుసార్లు గెలిచింది అవంతే! 2009లో ఆయ‌న ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున గెలిచారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు 6 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ వ‌చ్చింది. ఇక‌, 2014లో గంటా శ్రీనివాస‌రావు విజ‌యంద‌క్కించుకున్నారు. ఆయ‌న ఏకంగా.. 37 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. స్థానికంగా ఉన్న రాజ‌కీయాల నేప‌థ్యంలో మెజారిటీని చూసుకున్న‌ప్పుడు.. గంటాను మించి.. అవంతి మెజారిటీ సాధించ‌లేక‌పోయార‌నే టాక్‌.. త‌ర‌చుగా వినిపిస్తోంది. దీంతో అవంతి ఎక్కువ‌గా భీమిలిపై కాన్స‌న్‌ట్రేట్ చేస్తున్నారు.

అక్క‌డే ఉంటూ.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. దీనికి కార‌ణం.. గంటా మెజారిటీని దాటి తాను మెజారిటీ సాధించాల‌నేది ఆయ‌న వ్యూహం. ఇక‌, ఇప్పుడు గ‌తంలో ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన టీడీపీ నాయ‌కులు స‌బ్బం హ‌రి .. ప‌ర‌మ‌ప‌దించిన నేప‌థ్యంలో  ఆ పార్టీ కొత్త‌నేత‌కు అవ‌కాశం ఇవ్వాల్సి వ‌స్తుంది. అయితే.. కొత్త నేత ఎవ‌రు.. అనేది తెలియాల్సి ఉంది. ఇదే.. ఇప్పుడు అవంతికి క‌లిసి వ‌చ్చిన అంశంగా చెబుతున్నారు. ఎవ‌రు పోటీ చేసినా.. త‌న‌కు తిరుగులేద‌ని.. గంటా క‌న్నా ఎక్కువ మెజారిటీ సాధిస్తాన‌ని.. త‌ర‌చుగా చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: