వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అన్న మాటని ఇప్పటికే నిరూపించారు. వైసిపి పార్టీని గెలిపించి జగన్ సీఎం కావాలనే కోరిక  తీర్చిన ఘనత ప్రశాంత్ కిషోర్దే అనేది అక్షరాలా నిజం. అందుకే ఇప్పుడు అన్న జగన్ బాటలోనే వైయస్ షర్మిల నడవనున్నారట. పీకే సలహాలు,  సూచనలు పాటించాలని  నిర్ణయించుకున్నారట. తన అన్న రికార్డులను తిరగరాసి, కొత్త చరిత్ర కోసం షర్మిల  ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20 వ తేదీన చేవెళ్లలో షర్మిల భారీ బహిరంగ సభ జరపనుంది. అనంతరం అక్కడి నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. 14 నెలలు, 4 వేల కిలోమీటర్లు, 90 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుందట.

 అయితే ప్రతి రోజుకు పన్నెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నాడు జగన్ పాదయాత్రలో ఏ రకంగా ప్రజలతో మమేకమయ్యారో షర్మిల సైతం యువతే లక్ష్యంగా యాత్ర చేయనున్నారు. అన్న జైల్లో ఉన్న సమయంలో షర్మిల 2012లో అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్ర 2013 ఆగస్టు నాల్గవ తేదీ వరకు కొనసాగింది. మొత్తం 14 జిల్లాల్లో 3వేల కిలోమీటర్ల యాత్ర  సాగింది. ఇక వైసీపీ అధినేతగా జగన్  తన సుదీర్ఘ పాదయాత్ర 341 రోజుల పాటు మొత్తంగా 3648 కిలోమీటర్ల మేర సాగింది.దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో జగన్ మమేకమయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయంగా ప్రవేశించిన వైయస్ షర్మిల కూడా కీలక అడుగు వేస్తున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్సిపి పేరుతో పార్టీని ప్రారంభించారు. తెలంగాణ రాజకీయల తో తనకేం సంబంధం అని ప్రశ్నకు సుదీర్ఘకాలం షర్మిల సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో పార్టీ విస్తరణ, మద్దతు పైన పూర్తిగా వైయస్సార్ అభిమానుల పైనే షర్మిల ఆధారపడ్డారు. ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మద్దతు తీసుకుంటున్నారు.

 ఆయన టీం వ్యూహాల మేరకే పాదయాత్రలో షర్మిల కొత్త అడుగులు వేయనున్నారు. పాదయాత్రలో పీకే టీం సభ్యులు సైతం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్ర తో తెలంగాణ ప్రజల్లో షర్మిల ఏ మేరకు అభిమానాన్ని సంపాదించుకుంటారో వేచిచూడాలి. పీకే టీం వెన్నంటే ఉండడంతో తెలంగాణలో షర్మిల జెండా రెపరెపలాడుతుందంటూ టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: