తాను దళిత బంధును అడ్డుకుంటున్నట్టు టీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా ఈ పథకాన్ని అమలు చేసే సత్తా లేకే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. దళిత బంధు వద్దంటూ తాను ఈసీకి లేఖ రాసినట్టు ఫేక్ లెటర్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, మూడు ఎకరాల భూమి, ఎస్సీలకు సీఎం పదవి.. ఇవన్నీ ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

ఇక హరీశ్ రావు సభలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అడిగిన యువతిని ఇష్టం వచ్చినట్టు కొడతారా..? అని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. చివరకు ఆమెకు పిచ్చి పట్టిందని.. మెంటల్ డిజార్డర్ ఉందని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని హెచ్చరించారు. ఎన్నికలు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు గుర్తొస్తాయా..? అని ఈటల నిలదీశారు.

అసలేం జరిగిందంటే.. ఉద్యోగాలపై ప్రశ్నించినందుకు తనపై దాడి జరిగిందని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని కోట నిరోష ఆరోపించింది. వీణవంకలో ధూంధాం ప్రోగ్రామ్ జరుగుతుంటే.. నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదని ప్రశ్నించారని.. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు తనను కొట్టారని తెలిపింది. ఆ తర్వాత పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి.. దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే దళిత బంధు డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో వేస్తూనే.. డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేయించారని ఆరోపించారు. దేశంలో బ్యాంకులు ఎప్పటికీ లబ్ధిదారుల అకౌంట్ లో పడిన సొమ్మును ఫ్రీజ్ చేసిన దాఖలాల్లేవన్నారు. ఇప్పటి వరకు ఒక్కరూ దళిత బంధు డబ్బులను వాడుకోలేదని తెలిపారు.





మరింత సమాచారం తెలుసుకోండి: