తమిళనాడుకు మరోసారి భారీ వర్ష ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేటలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని.. అది తదుపరి 48గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడొచ్చన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక భారీ వర్షాల కారణంగా చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు రేపు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్ర రూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన కారణంగా.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అటు నెల్లూరు జిల్లా రాపూరు దగ్గర పెద్ద చెరువు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాల కారణంగా చెరువు నిండగా.. ఏ క్షణమైనా చెరువుకట్ట తెగే ప్రమాదముందంటోంది. చెరువు అంచు దాటి నీరు ప్రవహిస్తుండగా.. చెరువుకు గండి కొట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో సిద్ధవటం, బండెపల్లి, మసీదుపేట సహా పలు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై వరుణుడు పగబట్టినట్టే ఉన్నాడు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం సృష్టించి ప్రాణ,ఆస్తి నష్టాన్ని మిగిల్చాడు. ఇక చాలదన్నట్టు మళ్లీ వణికిస్తున్నాడు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజల పట్ల ధికారులు అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: