తెలంగాణలో రైతు బంధు నగదు బదిలీ జరుగుతోంది. కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు కేసీఆర్ సర్కారు ఈ నగదు బదిలీ ప్రారంభించింది. ముందుగా తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ.. ఆ తర్వాత క్రమంగా ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేసింది. మొత్తం మీద ఈ ఆరు రోజుల్లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ రూ.512.26 కోట్లకు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది.


ఆరో రోజు దాదాపు రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఇప్పటి వరకు మొత్తం ఆరు రోజుల్లో 59,51,428 మంది రైతుల ఖాతాలకు రూ.5806.35 కోట్లు బదిలీ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. సమైక్య పాలనలో దండగన్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండగ చేసి చూపించారని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాలలో ఉపాధి వెతుక్కున్న రైతాంగాన్ని కేసీఆర్ తిరిగి వ్యవసాయ రంగం వైపు మరలించారని మంత్రి కొనియాడారు.


జనాభాలో 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని వివరించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. తెలంగాణలో 63 లక్షల కుటుంబాలకు ఈ విడత రైతుబంధు సాయం అందుతుందని తెలిపారు. మొత్తం రాష్ట్ర జనాభాలో 2.50 కోట్ల జనాభా ఈ రైతు బంధు పథకం ద్వారా ప్రత్యక్ష్యంగా లబ్ధి పొందుతుందని మంత్రి వివరించారు. వ్యవసాయ రంగం బలోపేతంతో తెలంగాణ పల్లెల స్వరూపం మారిపోయిందని.. ఇది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.


రైతు బంధు పథకం ద్వారా నేరుగా రైతులకు పెట్టుబడి సాయం చేయాలన్న తలంపు మొదట అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ.. ఆ తర్వాత ఇదే తరహాను కేంద్రం కూడా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి పేరుతో నగదుబదిలీ ప్రారంభించింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: