ఉత్తర ప్రదేశ్ లో శాంతిభద్రతలను కాపాడడమే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ సీఎం చేయబోతోంది. ఇదే ఇప్పుడు బీజేపీ ఎన్నికల అంశంగా మారుతోంది. ప్రధాని మోడీ కూడా ఈ అంశాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో కూడా యూపీలో శాంతిభద్రతల పరిస్థితి పై ప్రజలు పాజిటివ్ గా ఉన్నట్లు తేలింది. అందువల్లే యోగి మరోసారి సీఎం పగ్గాలు చేపట్టే అవకాశాలు మెరుగయ్యాయి.టైమ్స్ నౌ, నవ భారత్ కోసం ఓ సంస్థ చేపట్టిన సర్వేలో బిజెపి 230 నుంచి 249 సీట్లు గెలుచుకోవచ్చని తేలింది. సమాజ్ వాది పార్టీ 137 నుంచి నూట యాభై రెండు సీట్లు కైవసం చేసుకోవచ్చు. అన్నింటికన్నా బీఎస్పీ పరిస్థితే దారుణంగా మారింది.

 ఈ పార్టీ 9 నుంచి 14 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునేటట్లు కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమైపోతోంది.అంత మాత్రాన బిజెపి పరిస్థితి చాలా గొప్పగా ఉందని చెప్పడంలేదు. గత ఎన్నికల కన్నా దాదాపు మూడు శాతం ఓట్లు తగ్గనున్నాయి. బిజెపి అప్పట్లో 40శాతం ఓట్లు కైవసం చేసుకొని 312 సీట్లు గెలుచుకుంది. ఇక సమాజ్ వాది పార్టీ పరిస్థితి చాలా మెరుగు కానుంది. ఆ పార్టీ 34.4 శాతం ఓట్లు చేజిక్కించుకోనుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 21 శాతం ఓట్లు మాత్రమే గెలుచుకుని 45 స్థానాల్లో గెలిచింది. ఇక బీఎస్పీ ఓటు శాతం 22 నుంచి 14 శాతానికి పడిపోనుంది. బిఎస్పి ఓట్లనే బీజేపీ, సమాజ్ వాది పార్టీలు పంచుకున్నట్టున్నాయి. యూపీలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడటమే బీజేపీకి ప్లస్ కానుంది. యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదట ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎక్కడ నేరస్తులు ఉన్న వారి పని పట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో చాలామంది ఎన్కౌంటర్లలో హతమవ్వగా, మిగిలినవారు జైలుపాలయ్యారు. మాఫియా లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సామాన్యులకు స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఏర్పడింది. అంతకుముందు సమాజ్ వాది పాలనలో మాఫియా డాన్ లు చెప్పిందే వేదమన్నట్లు నడిచేది. ప్రభుత్వంలో కొందరి అండదండలతో వీరు పేట్రేగిపోయేవారు. యోగి రాకతో వీరి ఆగడాలు ఆగిపోయాయి. అందుకే చాలామంది యోగి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది.

 ఇదే సమాజ్ వాది పార్టీకి మైనస్ గా మారింది. లేకుంటే అఖిలేష్ అవకాశాలు మెరుగుపడేవని భావిస్తున్నారు. అందుకే ప్రధాని మోడీ కూడా తన ప్రచారంలో తరచుగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టున్నారు. ఇక లఖింపూర్ ఖేరి ఘటన, కోవిడ్ రెండో దశ నాటి పరిస్థితి కొంత బీజేపీని నష్ట పరచవచ్చని భావిస్తున్నారు. అయినా కూడా శాంతి భద్రతల అంశం ముందు  ఇవి వెనక్కి పోతాయని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: