ఇంతకీ చేగొండి హరిరామజోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మిత్రుడా లేకపోతే అనుకూల శతృవా అన్నది అర్ధంకావటంలేదు. పవన్ను ఉద్దేశించి జోగయ్య తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంతకీ జోగయ్య ఏమంటారంటే రాబోయే ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీచేసినా అధికారంలోకి రావటం ఖాయమట. కాకపోతే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే రాష్ట్రాభివృద్ధిలో నరేంద్రమోడీ పరపతి ఉపయోగపడుతుందని చెప్పారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబునాయుడు క్యాడర్, అనుభవం పవన్ కు ఉపయోగపడుతుందన్నారు. అయితే జనసేన పొత్తు బీజేపీతోనా లేకపోతే టీడీపీతోనా అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలోని 22 శాతం కాపులంతా పవన్ కు మద్దతుగానే ఉన్నారట. కాబట్టి ఒంటరిగా పోటీచేసినా జనసేనను అధికారంలోకి రాకుండా ఎవరు అడ్డుకోలేరని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబంతా అనుభవం లేకపోయినా పవన్ కు కావాల్సినంత కామన్ సెన్స్ ఉందని జోగయ్య సర్టిఫై చేశారు.
అంతాబాగానే ఉందికానీ తాను ఒంటరిగా పోటీచేస్తే జనసేనకు రెండోసారి కూడా వీరమరణం తప్పదని స్వయంగా పవనే బహిరంగసభలో ప్రకటించిన విషయం జోగయ్య మరచిపోయినట్లున్నారు. ఈ ప్రకటనతోనే ఒంటరిపోటీకి పవన్ ఎంత భయపడుతున్నారో అర్ధమైపోతోంది. అందరికీ అర్ధమైన పవన్ భయం జోగయ్యకు అర్ధంకాకపోవటమే విచిత్రంగా ఉంది. అలాగే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళినా, ఒంటరిగా పోటీచేసినా ఫలితం ఒకటే అని పవన్ భయపడుతుంటే జోగయ్య మాత్రం జనసేన ఒంటరిగా పోటీచేయాలని చెప్పటంలో అర్ధమేంటి ?
కాపులు కూడా తనను నాయకుడిగా గుర్తించలేదని, పోయిన ఎన్నికల్లోల కాపులు కూడా తనకు ఓట్లేయలేదని ఒకవైపు పవన్ తెగ ఫీలైపోతుంటే జోగయ్యేమో 22 శాతం కాపులు పవన్ వెంటే ఉన్నారని ఎలా చెప్పగలుగుతున్నారు ? పవన్ కే తన గెలుపుపై నమ్మకం లేదని తెలిసిపోతోంది. అలాంటిది జోగయ్య మాత్రం పవన్ బ్రహ్మాండమని పదేపదే చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. చివరకు పవన్ను జోగయ్య ఏమి చేయబోతున్నారో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి