
అందరి కళ్ళు అసెంబ్లీపైనే నిలిచింది. ఎందుకంటే ఈరోజునుండి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు రచ్చురచ్చ చేశారు కాబట్టే. ఈ సమావేశాలు మొత్తం చంద్రబాబునాయుడు కేంద్రంగానే జరగబోతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అవినీతిపరుడని అసెంబ్లీలో చెప్పటానికి వైసీపీ అవసరమైనన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంది. ఇదే సమయంలో చంద్రబాబును అన్యాయంగా ఇరికించి అరెస్టుచేసి రిమాండుకు పంపారని టీడీపీ సభ్యులు వాదిస్తున్నారు. తమ వాదన అసెంబ్లీ చెల్లదు కాబట్టే నానా గోలచేశారు.
చంద్రబాబు అంశమే కేంద్రంగా నిలవబోతోంది కాబట్టి మిగిలిన అంశాలు పెద్దగా చర్చకు వచ్చే అవకాశాలు దాదాపు లేవనేచెప్పాలి. కాకపోతే టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసి అధికారపార్టీ సమావేశాలను సజావుగా నడిపించుకునే వీలుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు సభలో చంద్రబాబు అవినీతిపైన వివరంగా మాట్లాడాలని, జనాలకు వివరించాలని అన్నట్లుగా ప్రచారం అవుతోంది. దీంతో టీడీపీ సభ్యులు అలర్టయ్యారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే ఆలస్యం స్పీకర్ పోడియం మీద పడ్డారు. మీసాలు తిప్పటం, తొడలు కొట్టి రెచ్చిపోయారు.
అసెంబ్లీ సమావేశాల్లో బలబలాలు తేల్చుకునేందుకే పార్టీలు, సభ్యులు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజా సమస్యలపై చర్చించటం, పరిష్కారాలను కనుగొనటం, వాటిని ప్రభుత్వానికి సూచించటం అన్నది ఎప్పుడో పోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన బలాన్ని చాటుకునేందుకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటోంది. ఈ విషయాన్ని జనాలు చాలా సంవత్సరాలుగా చూస్తునే ఉన్నారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయంటే తమ ప్రతినిధులు సమస్యలను ప్రస్తావిస్తారని ఎదురుచూసే జనాలు ఇపుడెవరు లేరు.
మొత్తంమీద వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్ష సభ్యుల బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది. ఇప్పటివరకు సమావేశాలు జరిగిన విధానం వేరు ఇపుడు జరగబోయే సమావేశాలు వేరని మాత్రం చెప్పవచ్చు. నిజానికి చంద్రబాబు అరెస్టు, రిమాండు, అవినీతి అంశాలపై ఏసీబీ, హైకోర్టులో విచారణలు జరుగుతున్నాయి. కోర్టు విచారణలో ఉన్న అంశాలను ప్రస్తావించటానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇపుడు అలాంటి మొహమాటం, ఆలోచన ఎవరిలోను ఏమీ కనబడటంలేదు. దేనిదారి దానిదే అన్నట్లుగా తయారైందిపోయింది మొత్తం వ్యవహారం. అందుకనే ఈరోజు నుండి జరుగుతుందనే విషయమై అందరి కళ్ళు అసెంబ్లీ సమావేశాలపైనే నిలిచింది.