కనిగిరి నియోజకవర్గంలో మరోసారి గట్టి పోటీ తప్పదనే మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ప్రస్తుత టీడీపీ అభ్యర్థి డా.ఉగ్ర నరసింహారెడ్డి తీరు అంటున్నారు స్థానికులు. 2014లో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కదిరి బాబూరావును 2019 ఎన్నికల్లో అనూహ్యంగా దర్శికి మార్చారు చంద్రబాబు. ఆయన స్థానంలో డా.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన టీడీపీలోకి మారడంతో.. ఆయనకు టికెట్ కోసం కదిరి బాబూరావును మార్చారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి ప్రతికూలత ఏర్పడింది అనేది వాస్తవం.


2019లో పోటీ చేసి ఓడిన ఉగ్ర నరసింహారెడ్డి... వైద్యులు కావడంతో... గుంటూరులో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఆయన చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్నారనే మాట ఇక్కడ టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతోంది. పార్టీలో కేవలం నలుగురైదుగురిని మాత్రమే ఏజెంట్లుగా పెట్టుకుని... వారి ద్వారానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది కిందిస్థాయి కార్యకర్తల ఆరోపణ. నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న టీడీపీ నేతలను కలుపుకుంటూ వెళ్లడంలో ఉగ్ర విఫలమయ్యారనేది వాస్తవం.


అదే సమయంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం కావడంతో.. 2019 ఎన్నికల్లో బుర్రా మధుసూధన్ యాదవ్ గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో బుర్రాను కందుకూరు మార్చిన జగన్... ఆయన స్థానంలో హ‌నుమంతుని పాడు జ‌డ్పీటీసీ ద‌ద్దాల నారాయణ యాదవ్‌కు అవకాశం కల్పించారు. దీంతో మరోసారి బీసీ మంత్రం జరిస్తున్నారు వైసీపీ నేతలు. అయితే ఈసారి బీసీ మంత్రం అంతగా ఫలితం చూపించే అవకాశం లేదంటున్నారు స్థానికులు. ఇందుకు కారణం... బుర్రా మధుసూధన్ యాదవ్‌కు టీటీడీ బోర్డు మెంబర్‌గా అవకాశం ఇచ్చినప్పటికీ... ఆయన పెద్దగా నియోజకవర్గం నేతలకు సహకరించింది లేదు.


 పైగా ఆయనపైన పలు ఆరోపణలు  కూడా ఉన్నాయని... అందుకే కనిగిరి నుంచి కందుకూరుకు బదిలీ చేశారనే మాట వినిపిస్తోంది. ఇక వెలుగొండ ప్రాజెక్టు నీరు వస్తుందనే మాట దాదాపు ఐదేళ్లుగా చెబుతుండటం కూడా వైసీపీకి కాస్త మైనస్. ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభించారని... అందుకే నీళ్లు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో మరో కీలక అంశం ఉపాధి అవకాశాలు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత మరోసారి వలస వెళ్లారని... కాబట్టి వైసీపీ ఓడుపోతుందనేది కొందరి మాట.


టీడీపీ గెలవాలంటే స్థానికంగా ఉన్న నేతలతో పాటు కిందిస్థాయి కార్యకర్తలను కూడా డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కలుపుకుని వెళ్లాల్సిందే అనే మాట వాస్తవం. టీడీపీకి మరో అనుకూల అంశం ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయడమే. మాగుంట కుటుంబానికి కనిగిరి నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. జల దాత అనే పేరు ఉంది. ఇవి టీడీపీకి అనుకూలించే అంశాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: