దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తనను తాను ప్రజల ముందు కనబర్చుకుంటున్న వైఎస్ షర్మిల ప్రస్తుతం రాజకీయాల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేని వ్యక్తిగా మారిపోయింది. గతంలో ఏపీలో ప్రస్తుత సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆమె తనదైన విమర్శలతో విరుచుకుపడింది. దీంతో ఒక్కసారిగా ఆమె రాజకీయ ప్రత్యామ్నాయం అవుతుందని అంతా భావించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఆదరణకు నోచుకోని కాంగ్రెస్ పార్టీకి ఆమె ఆశాకిరణంగా మారారు. దీంతో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా నియమించింది. ఇక వైసీపీలో సీటు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఆమె పార్టీలో చేరడంతో కొంచెం జవసత్వాలు వచ్చినట్లు అయింది. వివిధ పార్టీల్లో టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం ప్రారంభించారు. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాల్సిన షర్మిల ప్రస్తుతం తేలిపోయినట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్‌పై చేసిన విమర్శలే పదే పదే చేస్తోంది. దీంతో ఆమె ప్రసంగాల్లో పస లేదనిల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె సభలకు వస్తున్న ప్రజలు కూడా కాసేపటికే లేచి వెళ్లిపోతున్నారు.

ఏపీ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు షర్మిల ప్రకటన చేసిన వెంటనే దానిపై సర్వత్రా రాజకీయ చర్చ సాగింది. ఇక తన అన్న, సీఎం జగన్‌పై ఆమె ఎలాంటి విమర్శలు చేస్తుందో అని అంతా ఎదురు చూశారు. అయితే ఒక్క వైఎస్ వివేకా హత్య చుట్టూనే ఆమె విమర్శలు సాగుతున్నాయి. ఇలాగే చేస్తే లాభం లేదనకుని, ఇతర పార్టీలపై కూడా ఆమె విమర్శలు చేయడం ప్రారంభించారు. లేదంటే ఒకే రకమైన విమర్శలు జగన్‌పై పదే పదే చేస్తే అది జగన్‌కే లాభం అని, ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని తమ పార్టీ సీనియర్ నేతల సూచనతో ఆమె తన పంథా మార్చారు. చివరికి కొత్త విమర్శలు చేస్తారనుకుంటే అలాంటివి ఏమీ కనిపించడం లేదు. దీంతో సభలకు, ర్యాలీలకు వచ్చిన ప్రజలు పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేక పోతున్నారు. వైఎస్ జగన్ గురించి కొత్త విమర్శల కోసం, ప్రజలకు తెలియని ఏవైనా విషయాలను ఆమె ప్రస్తావిస్తుందేమోనని అంతా చూస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె సీట్లు సాధించకపోయినా, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఆమె పెంచుతుందేమోనని ఆ పార్టీ అధిష్టానం గంపెడాశలు పెట్టుకుంది. అయితే అలాంటివేమీ ప్రస్తుతం కనిపించడం లేదనే చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: