•ఆముదాలవలసలో ఆసక్తికర రాజకీయం 
•మామ అల్లుళ్ళ మధ్య టఫ్ ఫైట్
•మామకి చెక్ పెట్టనున్న అల్లుడు


ఆముదాలవలస - ఇండియా హెరాల్డ్: ప్రస్తుతం ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేత తమ్మినేనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రజలను పట్టించుకోలేదనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామాల్లో రహదారులు దారుణంగా ఉన్నా.. మరమ్మతులు చేయించలేకపోయారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న గ్రామాలు చాలానే ఉన్నాయి. ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామన్న పథకం పూర్తిస్థాయిలో అమలు చేయలేదు.పైగా తమ్మినేని సీతారాం గత ఐదేళ్ల కాలంలో తన నియోజకవర్గం పరిధిలో ప్రతి పనికి కమీషన్లు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  చెన్నై, కోల్‌కతా సమీపంలోని భూముల్లో లేఅవుట్ల విషయంలో భారీగా పర్సంటేజీలు వసూలు చేశారనే ఆరోపణలు తమ్మినేనిపై ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో తమ్మినేని సీతారాం భార్య కీలకంగా వ్యవహరించారని తెలిసింది. ఏ పని కావాలని వెళ్లినా కమీషన్లు తీసుకునేవారనేది తమ్మినేని సీతారాం కుటుంబంపై ఉన్న ఆరోపణ. దీంతో ఈసారి నియోజకవర్గంలో ఆయన గెలవడం అసాధ్యమనే ప్రచారం బాగా జరుగుతోంది. సొంత సామాజిక వర్గం ప్రజలే ఆయనపై వ్యతిరేకతతో ఉన్న కారణంగా ఓట్లు తక్కువ పడ్డాయని తెలుస్తుంది.


ఇక కూన రవికుమార్ తమ్మినేని సీతారాంకు స్వయాన మేనల్లుడు. అయినప్పటికీ రాజకీయంగా వీరిద్దరూ కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. 2009లో కూన రవికుమార్‌కు టీడీపీ టికెట్ ఇవ్వడం వలన తమ్మినేని పార్టీ వీడారు. 2009 నుంచి 2019 దాకా 3 సార్లు కూన రవి కుమార్ ఆముదాలవలస నుంచి పోటీచేసి ఒకసారి గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి తనవంతు కృషి ఎంతో చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల తరపున పోరాటం చేసిన నాయకుడు ఈ కూన రవికుమార్. ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో.. ఆయనపై తమ్మినేని సీతారాం ప్రోద్భలంతో అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూన రవి పోటీచేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేనిపై ఉన్న వ్యతిరేకత రవికుమార్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆముదాలవలసతో కూన రవి కుమార్ ఆధిపత్యం ఖాయమని ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: