
ఆపరేషన్ సిందూర్.. భారత రక్షణ దళాలు ఇటీవల నిర్వహించిన అత్యంత కీలకమైన మిలిటరీ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం ద్వారా దేశ భద్రతకు మించి దేశ గౌరవాన్ని కాపాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ చరిత్రాత్మక ఘటనను విద్యార్థులకు చేరవేయాలనే సంకల్పంతో ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు ముందుకు వచ్చింది.
ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు ముఫ్తీ షమూన్ ఖాస్మీ తాజా ప్రకటనలో.. రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని వెల్లడించారు. ఈ చర్య విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 451 మదర్సాలు ఉన్నాయి, వీటిలో అందుబాటులో ఉన్న విద్యార్థుల సంఖ్య సుమారు 50,000. వీరందరికీ ఈ ఆపరేషన్ గూర్చిన వివరాలను విద్యార్ధుల దృష్టికి తీసుకురావడం ద్వారా, దేశభక్తి భావనను బలపర్చే యత్నంగా దీన్ని చూస్తున్నారు.
ఈ నిర్ణయం తీసుకునే ముందు, ముఫ్తీ ఖాస్మీ డిల్లీలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. ఆయనతో పాటు విద్యావేత్తలు, సూఫీ పండితులు ఇంకా మేధావుల బృందం కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఫ్తీ ఖాస్మీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దేశం గర్వించదగిన ఘట్టంగా గుర్తించాలి. మదర్సాలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సైనికులు చూపిన ధైర్యం, తెలివితేటలపై గర్వించాలి అని వ్యాఖ్యానించారు.
ముఫ్తీ ఖాస్మీ పేర్కొనగా, ఇప్పటికే మదర్సాల్లో NCERT పాఠ్యపద్ధతి అమలులో ఉందని, దీనివల్ల విద్యార్థులు ప్రధాన విద్యా ప్రవాహంతో చేరుతున్నారని తెలిపారు. ఇప్పుడు దీనితోపాటు దేశ భద్రతకు సంబంధించి విద్యార్థులలో అవగాహన పెంచేందుకు ఈ కొత్త అధ్యాయాన్ని చేర్చనున్నారు. మదర్సా సిలబస్ కమిటీ త్వరలో సమావేశమై పాఠ్యాంశాన్ని తుదిరూపు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు షాదాబ్ షామ్స్ ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ మాట్లాడుతూ.. ఇది దేవభూమి ఉత్తరాఖండ్. ఇది సైనికుల భూమి కూడా. ఇక్కడ మడర్సాల్లో చదివే పిల్లలు దేశ రక్షణకు సంబంధించిన విషయాలు తెలుసుకోకపోతే, ఇంకెక్కడ నేర్చుకుంటారు? అని ప్రశ్నించారు. అంతేకాదు, రాష్ట్ర గవర్నర్ స్వయంగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కావడం, సీఎం ఒక సైనికుని కుమారుడవడంలాంటివి ఈ నిర్ణయానికి మరింత ప్రాముఖ్యతను కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.