
తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పటికీ ఎవరి ఒత్తిడికీ లొంగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని రైతులు, చిన్న వ్యాపారులు, పాడి రైతుల ప్రయోజనాలు తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం అని మోడీ హామీ ఇచ్చారు. ప్రపంచం అంతా ఆర్థిక స్వార్ధంతోనే ఉందని ఆయన పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని దేశ ప్రజలను కోరారు.
వ్యూహాత్మక భేటీ – 27న ప్రారంభమయ్యే టారిఫ్ లకు ముందు ప్లాన్ .. ఈ నెల 27 నుంచి అమెరికా విధించిన కొత్త టారిఫ్ లు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని కార్యాలయం మంగళవారం కీలక సమావేశం ఏర్పాటు చేస్తోంది. మోడీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో అమెరికా అధిక సుంకాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. అమెరికా టారిఫ్ లతో భారత్ లోని వస్త్ర పరిశ్రమ, తోలు రంగం, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రత్యేక రసాయనాలు, ఇతర అనేక రంగాలకు భారీ ఇబ్బంది కలగనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ నెల 7 నుంచి 25 శాతం సుంకాలు అమలులోకి వచ్చాయి. ఇలా 20 రోజుల వ్యవధిలో మరో 25 శాతం పెంపు అమల్లోకి రాబోతోంది. మొత్తానికి అమెరికా భారత్‌పై 50% వరకు భారాన్ని మోపింది.
ఇప్పటివరకు అమెరికా మార్కెట్ మీద ఎక్కువగా ఆధారపడ్డ భారత్, ఇప్పుడు ఇతర దేశాల వైపు చూస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాబోయే కీలక సమావేశంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో ఆసక్తి పెరిగింది. మొత్తం మీద అమెరికా టారిఫ్ దాడులు భారత్‌ను సవాల్‌లోకి నెడుతున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలే రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక దిశను నిర్ణయించబోతున్నాయి.