
సీనియర్ నేతల అభిప్రాయం ప్రకారం విజయవాడలో టిడిపి వ్యూహాత్మకంగా అడుగులు వేయడం లేదు. లోకల్ వైసిపి నాయకులను చీల్చి తమ వైపు తిప్పుకునే శక్తి టిడిపి వద్ద కనిపించలేదని వారు అంటున్నారు. విశాఖ వంటి పెద్ద నగరంలో పార్టీ పాగా వేసినప్పుడు, రాజధాని పరిధిలో ఉన్న విజయవాడలో ఎందుకు విఫలమయ్యారు అన్న ప్రశ్నను నారా లోకేష్ లేవనెత్తుతున్నాడు. ఈ కారణంగానే ఆయన స్థానిక ఎమ్మెల్యేలపైనా, ఎంపీపైనా అసహనంగా ఉన్నారని సమాచారం. రాజధాని నగరంలో రెండు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా.. నిర్ణయాలు మాత్రం మేయర్, కార్పొరేషన్ పరిధిలోని వైసిపి నేతలే తీసుకుంటున్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, పట్టాల పంపిణీ, తాగునీటి సమస్యలు పరిష్కరించడంలోనూ టిడిపి నేతల ప్రభావం లేకపోవడం పార్టీకి ఇబ్బంది కలిగిస్తోంది. అందుకే స్థానిక కార్పొరేటర్లు, కీలక వ్యక్తులను టిడిపి వైపు తిప్పుకోవాలని లోకేష్ ఆదేశించినా.. ఇప్పటివరకు ఎటువంటి కదలిక జరగకపోవడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. మొత్తానికి, విజయవాడలో వైసిపి బలాన్ని తగ్గించలేకపోవడమే టిడిపి లోపం అని లోకేష్ అభిప్రాయపడుతున్నారు. స్థానిక నేతలు చురుకైన వ్యూహం అవలంబించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో విజయవాడలో టిడిపి పట్టు సాధించేందుకు కొత్త వ్యూహాలు చేపడతారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.