విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా 3నెలల ఉద్యమం బషీర్ బాగ్ కాల్పుల వరకూ సాగింది. 2000 మే నెల టీడీపీ మహానాడులో చంద్రబాబు కరెంటు ఛార్జీల పెంపుదలను ప్రకటించారు. దానికి కొన్ని నెలల ముందే 1999 ఎన్నికల్లో టీడీపీ అధికారం నిలబెట్టుకోవడంతో వచ్చిన ధీమా వల్ల ఇష్టారాజ్యంగా విద్యుత్ భారం మోపారు. దాంతో జనం భగ్గుమన్నారు. కమ్యూనిస్టులు ప్రారంభించిన ఉద్యమంలో కాంగ్రెస్ కూడా చేతులు కలిపింది. ఉమ్మడి రాష్ట్రంలోనే చారిత్రక పోరాటంగా మారింది. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో పెను మార్పులు తెచ్చింది.


ఈ ఉద్యమం తెలుగు రాష్ట్రాల చరిత్రనే మార్చేసింది. ప్రపంచబ్యాంకు షరతుల అమలు ఆలశ్యమయ్యింది. విద్యుత్ ఛార్జీలు యధేశ్ఛగా పెంచేందుకు ప్రభుత్వాలు సిద్ధం కాలేకపోయాయి. ఇప్పటికీ ట్రూ అప్, ఎఫ్పీపీసీఏ అంటూ రకరకాల పేర్లతోనే వాయింపు. కరెంటు ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వాలు పలుమార్లు ఆలోచించేలా చేసిన చరిత్ర ఆ ఉద్యమానిది. దానికి మించి ఉచిత విద్యుత్ నినాదం విధానంగా మారడానికి ఆ ఉద్యమమే కారణం. విద్యుత్ సంస్కరణల కారణంగా ఉచితంగా ఇవ్వడానికి లేదు. అయినా గానీ రాజకీయంగా ఉచిత విద్యుత్ ప్రధానాంశమయ్యింది. రైతులను ఆకర్షించింది. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయరంగం రూపురేఖలను మార్చేసింది. ముఖ్యంగా ఉద్యానపంటలు, వివిధ దేశాలకు ఎగుమతులు అంటూ ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పుకుంటున్న ఘనతకు అదే ఆరంభం. సాగునీటిపారుదల లేని ప్రాంతంలో ఉచిత విద్యుత్ కారణంగా బోర్లు ద్వారా వ్యవసాయం పెరిగింది. ప్రస్తుతం కోనసీమ కన్నా అనంతపురంలో తలసరి ఆదాయం పెరుగుదల రేటు ఎక్కువగా ఉండేటంత స్థాయికి ఈ మార్పు తీసుకొచ్చింది.


విద్యుత్ ఉద్యమం మీద కాల్పులు జరిపించి ప్రాణాలు తీసిన వాళ్లు, ఉచిత విద్యుత్ ఇస్తే మొత్తం విద్యుత్ రంగమే దివాళీ తీస్తుందన్న వాళ్లు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చంటూ సూత్రీకరణలు చేసిన సంస్కరణవాదులు ఇప్పుడు ఇదంతా తమదే క్రెడిట్ అని చెప్పుకోవడానికి సంశయించకపోవడమే వర్తమాన విచిత్రం. ప్రజా ఉద్యమాలతోనే మార్పులు వస్తాయనడానికి ఇదో నిదర్శనం. ప్రజా భాగస్వామ్యంతో సాగించిన ప్రతీ పోరాటం ఎంతో కొంత సానుకూల ఫలితాలను, మార్పుని తీసుకొస్తుందనడానికి కళ్లెదురుగా కనిపిస్తున్న సత్యం. ప్రత్యేక తెలంగాణా రెండోదశ పోరాటానికి ఊపిరిపోసిన ఉద్యమం కూడా ఇదే.  విద్యుత్ ఉద్యమంలో నాటి చంద్రబాబు ప్రభుత్వ తుపాకీ తూటాలకు ప్రాణాలిచ్చిన బషీర్ బాగ్ అమరులకు జోహార్లు. ప్రజలు కదలాలి..ప్రభుత్వాలను కదలించాలని చాటిచెప్పిన ఉద్యమం అందరికీ పాఠం కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: