
అందుకే ఎన్నికల నుండి దూరంగా ఉండటమే మంచిదేమో అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ మరోవైపు సీనియర్ నేతలతోపాటు యువ నాయకులు మాత్రం ఇది పార్టీ బలాన్ని ప్రదర్శించుకునే చక్కని అవకాశమని చెబుతున్నారు. స్థానిక స్థాయిలో పోరాడకపోతే ప్రజలలో పార్టీపై విశ్వాసం తగ్గిపోతుందని, ఉనికే ప్రశ్నార్థకమవుతుందని వారు వాదిస్తున్నారు. ప్రజల కోణంలో చూసినా ఇదే భావన కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సాధారణమే కానీ పోటీ తప్పక ఉండాలన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలు పోటీలో పార్టీ లేకపోతే దాని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని స్పష్టంగా చెబుతున్నాయి.
గతంలో టిడిపి అధినేత చంద్రబాబు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉన్నా, ఆ పార్టీ నాయకులు స్వతంత్రంగా పోటీ చేసిన సందర్భాలు గుర్తుచేస్తున్నారు. అలానే ఇప్పుడు వైసీపీ అధికారికంగా తప్పుకున్నా, చాలా మంది స్థానిక నేతలు స్వతంత్రంగా బరిలోకి దిగుతామన్న సంకేతాలు ఇస్తున్నారు. మొత్తంగా వైసీపీకి ఇది కీలక నిర్ణయ దశ. పోటీలో ఉంటే పరాజయ భయం, పోటీలో లేకపోతే పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం. ఈ రెండు పరిస్థితుల్లోనూ సవాళ్లు తథ్యం. అయితే క్షేత్రస్థాయిలో యువ నాయకుల ఆత్మవిశ్వాసం, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని పార్టీ చివరికి పోటీ చేసేదిశగానే వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ తుది నిర్ణయం ఎలా ఉంటుందో ? చూడాలి.