
అయితే ఇక్కడే పెద్ద సమస్య తలెత్తింది. చిరాగ్ ఆ ఆఫర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎల్జేపీకి 40 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, “ఒక సీటు తగ్గినా ఊరుకోము” అని ఘాటుగా చెప్పినట్టు సమాచారం. తమ డిమాండ్లను అంగీకరించకుంటే, “తమ దారి తాము చూసుకుంటాం” అని ఎన్డీఏ పెద్దలకు అల్టిమేటం ఇచ్చారని కూడా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తమ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని చిరాగ్ సూచించినట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే — ఆ నమ్మకం ఇప్పుడు ఓటర్లలో ఉందా? అన్నది.
బీహార్‌లో గౌరవప్రదమైన అసెంబ్లీ సీట్లు, కేంద్ర కేబినెట్ పదవులకంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయి. ఈ తరుణంలో ఎన్డీఏలో ప్రధాని మోదీ ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలో, చిరాగ్ పాస్వాన్ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో బీహార్ రాజకీయాల్లో పెద్ద కలకలం సృష్టించబోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పార్టీకి చెందిన ఎంపీ శాంభవి చౌదరి మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టి పడేశారు. దీంతో, “బ్లాక్‌మెయిల్ ద్వారా సీట్లు సాధించాలనుకుంటున్నారా?” అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక మోదీ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారన్నది మరో పెద్ద ప్రశ్న. సాధారణంగా మోదీ ఏ సమస్యనైనా తన మాటలతో పరిష్కరించగలరు. కానీ ఈసారి బీహార్ ఎన్నికల విషయంలో మాత్రం ఆయన తేల్చలేని పరిస్థితిలో ఉన్నారని, “మోదీ చేతులెత్తేశారు” అంటూ ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. మొత్తానికి, బీహార్ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ హీట్ పెంచేస్తున్నాయి. చూడాలి మరి — ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరి ఖాతాలో చేరుతుందో!