శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలోని పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే ప్రధాన కారణం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చినా పోలీసులకు దేవాదాయ శాఖ అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. అంతేకాకుండా ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్లే మార్గం తిరిగి వచ్చే మార్గం ఒకటే ఉండటం వల్ల కూడా రద్దీ కి దారి తీసింది అని అంటున్నారు. శనివారం కార్తీకమాస ఏకాదశి కావడంతో కాశీబుగ్గ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు తరలి వచ్చారని చెబుతున్నారు. ఈ ఆలయంలో సుమారు మూడు వేల మంది దర్శనాలకు అవకాశం ఉండగా శనివారం ఉదయం తెల్లవారు జాము నుంచే వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్టు చెబుతున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయానికి ఆలయంలో సుమారు 25 వేల మంది భక్తులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు అంచనా వేస్తున్నారు.
ప్రమాదానికి ఆలయ నిర్వహకుడు హరి ముకుంద పండా చాదస్తం కూడా ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి. సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించిన హరి ముకుంద ఎవరు నుంచి సహాయం తీసుకోరని అంటున్నారు. 95 ఏళ్ల వృద్ధుడైన ఆయన తన పని చేసుకుంటాడని ... కనీసం ఎవరైనా చేయి అందించి అతనికి సాయం చేయాలని భావించినా మడి పేరుతో ముట్టుకోడానికి కూడా ఇష్టపడడు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆలయంలో సహాయ కార్యక్రమాలకు ఎవరు ముందుకు వెళ్లలేదని అంటున్నారు. ఏకాదశి కారణంగా ఉపవాస దర్శనానికి వెళ్లిన భక్తులు తొందరగా బయటకు రావాలన్న ఆతృత కూడా ప్రమాదానికి దారితీసింది అని అంటున్నారు. తొక్కిసలాటలో ఇప్పటివరకు పది మంది ప్రాణాలు కోల్పోగా అందులో 9 మంది మహిళలు ఉన్నారు. మృతుల్లో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి