రాజకీయంగా ఏ పార్టీ అయినా దీర్ఘకాలం నిలదొక్కుకోవాలంటే సంస్థాగత బలం అత్యంత కీలకం. అది కేవలం పెద్ద పార్టీలకే కాదు, ప్రతి రాజకీయ సంస్థకు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో ఎదురైన షాక్ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా తరచుగా “ పార్టీని లోకల్ స్థాయిలో బలోపేతం చేస్తాం ” అని స్పష్టంగా చెబుతున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయిలోని నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరించి, నిబద్ధత ఉన్న కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో సరైన నిర్ణయమే అని చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, పార్టీ స్థాయిలో చాలా మందికి గుర్తింపు దక్కలేదు. కొందరు శ్రమించినా పదవులు, గౌరవాలు అందుకోలేక మౌనం వహించారు. ఈ పరిస్థితి సర్వసాధారణ కార్యకర్తలలో అసంతృప్తిని పెంచింది. కాబట్టి ఇప్పుడు ఆ ఖాళీని పూరించేందుకు జగన్ ప్రయత్నించాల్సిన అవ‌స‌రం ఉంది.


అయితే ఈ ప్రక్రియలోనే పార్టీని వేధిస్తున్న రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
మొదటిది రాష్ట్రస్థాయి నాయకులు తమ అనుచరులను క్షేత్రస్థాయిలోని పదవులకు సిఫారసు చేస్తున్నారు. దీనిపై సమగ్రంగా పరిశీలన లేకుండానే పదవులు కేటాయిస్తున్నారని పార్టీ అంతర్గత వర్గాలే చెబుతున్నాయి. ఫలితంగా నిజంగా కష్టపడ్డ వర్కర్లు, గ్రాస్‌రూట్ లెవల్ యాక్టివిస్టులు వెనుకబడిపోతున్నారు. ఇక రెండోది  గతంలో పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన, కేసులు ఎదుర్కొన్న నాయకులను పట్టించుకోవడం లేదన్న భావన. వీరికి గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొంతమంది కార్యకర్తలు “మేము అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు పక్కనబెట్టారు” అని బహిరంగంగానే చెబుతున్నారు.


జగన్ గతంలో ఈ తరహా వాదనలపై స్పందిస్తూ, “పార్టీకి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీలు క్షేత్రస్థాయిలో అమలు అవ్వడంలేదని మరో విమర్శ వినిపిస్తోంది. నాయకత్వం ఇచ్చిన ఆదేశాలు లోకల్ లెవల్‌లో దారి మళ్లుతున్నాయన్న అభిప్రాయం కూడా బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ సంస్థాగత బలం పెంచే క్రమంలో విశ్వసనీయతే ప్రధాన సవాల్‌గా మారిందని చెప్పాలి. కార్యకర్తలు “మమ్మల్ని గుర్తిస్తారన్న నమ్మకం” కోల్పోతే, ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఉండదు. కాబట్టి జగన్ తన హామీలు నిజంగా నేలమీద అమలు అవుతున్నాయా అనే విషయంపై వ్యక్తిగతంగా ఫాలోఅప్ చేయడం తప్పనిసరి. సంస్థాగతంగా బలోపేతం కావాలంటే కేవలం పదవులు ఇవ్వడం కాదు, కష్టపడ్డవారిని గుర్తించి న్యాయం చేయడమే అసలు బలం. లేదంటే విశ్వసనీయతే వైసీపీకి మళ్లీ అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: