బీహార్ రాజకీయాల్లో మళ్లీ వేడి చెలరేగింది. రెండు దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో అసలు డ్రామా ఇప్పుడు మొదలుకానుందనే అంచనా వినిపిస్తోంది. 243 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ఇప్పటికే ముగిసింది. 121 సీట్లకు గురువారం పోలింగ్ జరిగి సుమారు 67 శాతం ఓటింగ్ నమోదవడం రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది. మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఇక ఈ రెండో దశలోనే బీహార్ రాజకీయ భవిష్యత్తు తేలిపోతుందనే అభిప్రాయం ప్రతి పార్టీకి ఉంది.


ప్రత్యేకంగా పూర్వాంచల్ ప్రాంతం - నాలుగు జిల్లాలు, 57 అసెంబ్లీ స్థానాలతో - కీలకంగా మారింది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం సాధించగలిగిన పార్టీకి అధికారంలోకి రావడానికి కావలసిన మేజిక్ ఫిగర్ దాదాపుగా ఖాయం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సీట్లలో యాదవులు, ముస్లింలు వంటి సామాజిక వర్గాలు ఆధిక్యంలో ఉండటంతో, ఆ వర్గాల ఓట్లు ఎవరి వైపు మొగ్గుతాయోనే మొత్తం ఫలితాన్ని ప్రభావితం చేయనుంది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలను ఆకర్షించేందుకు ప్రతి పార్టీ కూడా భారీ ప్రయత్నాలు ప్రారంభించింది.



ఇక తొలిదశలో భారీగా నమోదైన ఓటింగ్ శాతం, అధికార కూటమి జేడీయూ-బీజేపీపై కొంత ఒత్తిడిని పెంచింది. ఎక్కువ ఓటింగ్ సాధారణంగా మార్పు సంకేతమని భావించే రాజకీయ వర్గాలు, ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్షం ఈ ఊపును తమ వైపు మలుచుకునే దిశగా దూసుకుపోతోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పటికే బీహార్‌లో శిబిరం వేసి సదరు ప్రాంతాల్లో సుదీర్ఘ ప్రచారాలు చేస్తున్నారు.



ఇక బీజేపీ త‌ర‌ఫున ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. మూడురోజుల గడువులో గరిష్ట ప్రభావం చూపించేలా ఆయన పర్యటనలు ప్లాన్ చేశారు. 9వ తేదీ సాయంత్రం ప్రచారం ముగియనుండటంతో, ప్రతి నిమిషం విలువైనదిగా మారింది. ఆఖరి దశ ప్రచారంలో ఎవరు ప్రజల మనసును గెలుచుకుంటారోనే అసలు గేమ్ తేల్చబోతోంది.మొత్తం మీద బీహార్ రాజకీయ రంగంలో ‘మూడు రోజులు – ఒక నిర్ణయం’ అన్నట్లుంది. ప్రతి పార్టీ తమ చివరి బంతిని సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఉంది. పూర్వాంచల్ ప్రాంతంలో ఎవరు గెలుస్తారో, అదే బీహార్‌లో అధికార సింహాసనం ఎవరిదో నిర్ణయించబోతోంది. అందుకే రాజకీయ నేతలు అంటున్నారు – “ఇప్పుడే అసలు కథ మొదలవుతోంది!”

మరింత సమాచారం తెలుసుకోండి: