ఐపీఎల్ 2020 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ బలంగా పుంజుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. ఓపెనర్లు షేన్ వాట్సన్ (83 నాటౌట్: 53 బంతుల్లో 11x4, 3x6), డుప్లెసిస్ (87 నాటౌట్: 53 బంతుల్లో 11x4, 1x6) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో ఐదో మ్యాచ్ ఆడిన చెన్నై‌కి ఇది రెండో గెలుపుకాగా.. పంజాబ్‌కి ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్‌లో అంతకముందు కేఎల్ రాహుల్ (63: 52 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మన్‌దీప్ సింగ్ (27: 16 బంతుల్లో 2x6), నికోలస్ పూరన్ (33: 17 బంతుల్లో 1x4, 3x6), మయాంక్ అగర్వాల్ (26: 19 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించగా.. చెన్నై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు, జడేజా, పీయూస్ చావ్లా తలో వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్ ఓపెనర్లని ఏ దశలోనూ పంజాబ్ బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. క్రిస్ జోర్దాన్ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో డుప్లెసిస్ జోరందుకోగా.. లేటుగా టచ్‌లోకి వచ్చిన వాట్సన్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. స్పిన్నర్, పేసర్ అని తేడా లేకుండా ఓవర్‌కి పది చొప్పున ఈ జోడీ పరుగులు రాబట్టడంతో సగం ఓవర్లు ముగిసే సమయానికే మ్యాచ్‌పై పంజాబ్ ఆశలు వదిలేసింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా.. 10 వికెట్ల తేడాతో చెన్నై గెలవడం ఇది రెండోసారి. 2013లో పంజాబ్‌పైనే 10 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: