ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్‌ యాదవ్‌ మరో సారి తన బ్యాటింగ్ అంటే ఏంటో నిరూపించుకున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కేవలం 47 బంతుల్లో 120 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కాగా సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీకి ముందుగా టీమ్‌-బి, టీమ్‌-డి ఓ ప్రాక్టీస్ మ్యాచుఆడాయి.  బి-జట్టుకు సూర్య కుమార్‌ నాయకత్వం వహించగా యశస్వీ జైస్వాల్‌ డి-జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక మ్యాచ్ లో నంబర్ 3లో బ్యాటింగ్ చేసిన సూర్య కుమార్ బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.  47 బంతులు ఎదుర్కొన్న సూర్య కుమార్ 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 120 పరుగులతో సెంచరీ సాధించాడు.  ఇక సూర్య కుమార్ స్ట్రైక్‌ రేట్‌ 255.32 కావడం విశేషం.

అయితే ఈ మ్యాచ్ లో డి-జట్టు తరపున మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఆడాడు. అయితే అప్పటికే రెండు ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ 12 ఓవర్ అనంతరం తన మూడో ఓవర్ వేయడానికి వచ్చాడు. అయితే ఈ ఓవర్లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న సూర్య కుమార్ ఆ ఓవర్లో ఏకంగా  21 పరుగులు సాధించి... అర్జున్ కు చుక్కలు చూపించాడు. కాగా జనవరి 10 నుంచి 31 వరకూ సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 ట్రోఫీ జరగనుంది. బెంగళూరు, కోల్‌కత్తా, వడోదర, ఇండోర్, చెన్నై, ముంబై మొత్తం ఆరు వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో పాటు ఇటీవలే నిషేధం గడువు ముగించుకున్న శ్రీశాంత్ లు కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు.

కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున రాణిస్తున్న సూర్య కుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్ గురించి సగటు క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై ఇండియన్స్ తరపున పరుగుల వరద పారించిన సూర్య కుమార్‌ యాదవ్‌  ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవుతాడని ఆశించినా... చోటు దక్కలేదు. అయితే అతి త్వరలోనే సూర్య కుమార్‌ భారత క్రికెట్ లో అర్రంగేట్రం చేయడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: