ముంబై: టీమిండియా లెంజెండరీ ప్లేయర్, మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ మైదానంలో రెచ్చిపోతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ అదరగొడుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏకంగా 5 సిక్సులు బాది ఔరా అనిపించాడు. అంతేకాకుండా కేవలం 31 బంతుల్లోనే 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనికి తోడు బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇటీవలే ఐపీఎల్ వేలానికి ఎంపికైన ఆటగాళ్ల జాబితాలో అర్జున్ టెండుల్కర్ పేరు కూడా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వేలంలో మొత్తం 292 ఆటగాళ్లు పాలుపంచుకోనుండగా.. అర్జున్ టెండూల్కర్ రూ.20 లక్షల బేస్ ధరతో వేలంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అర్జున్‌పై అందరి చూపూ నెలకొంది. అతడు ఏ స్థాయిలో ఆడతాడో అనే అనుమానాలు కూడా అనేకమంది వ్యక్త పరిచారు. అయితే వారందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తాను ఓ చక్కటి ఆల్‌రౌండర్‌నని అర్జున్ ప్రూవ్ చేసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు వైపులా పదునున్న కత్తినని నిరూపించుకున్నాడు.

పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఇస్లామ్ జింఖానా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఈ రికార్డు సాధించాడు. ముంబైలోని ఎంఐజీ క్రికెట్ క్లబ్ తరపున బరిలోకి దిగిన అర్జున్ మూడు వికెట్లతో పాటు అర్థ సెంచరీతో రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తం 77 పరుగులు చేసిన అర్జున్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్సులతో చెలరేగాడు. అందులో 5 సిక్సులు ఓకే ఓవర్లో బాదాడు. దీంతో అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు.

 ‘అర్జున్ ఇంత గొప్ప ఆటగాడా.. కచ్చితంగా ఐపీఎల్‌లో అర్జున్‌ను చూడాల్సిందే’ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుండడం, అర్జున్ వేలంలో ఉండడంతో.. అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుంది..? ఏ జట్టు తరపున బరిలోకి దిగుతాడు..? ఎలా ఆడగాడు..? అని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: