ఇంటర్నెట్ డెస్క్: సూర్య కుమార్ యాదవ్, ముద్దుగా స్కై... టీమిండియాలో స్థానం కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. దానికోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అటు ఐపీఎల్‌లో ఇటు దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. తన ఆటతీరుతోనే టీమిండియాలో స్థానం పొందాలని అనుకున్నాడు. ఎట్టకేలకు సాధించాడు. టీమిండియా నుంచి అతడికి పిలుపొచ్చింది. మార్చి 12 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేశారు.

స్కై ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కే ఎంపిక కావల్సింది. స్కై కూడా జాతీయ జట్టుకు ఎంపికవుతానని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతడిని ఎంపిక చేయలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్రికెట్ అభిమానులైతే ఏకంగా సెలక్షన్ కమిటీ నిర్ణయంపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆసీస్ సిరీస్‌కు సూర్యను ఎంపిక చేయకపోవడంపై హర్బజన్‌, ఇర్ఫాన్‌ వంటి కొంతమంది క్రికెటర్లు బీసీసీఐని నిలదీశారు. త్వరలోనే భారత జట్టుకు ఆడతావని అతడికి ధైర్యం చెప్పారు.

స్కై గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. కానీ అతడి ప్రదర్శన జాతీయ జట్టుకు ఎంపిక చేయలేకపోయింది. అయితే అక్కడితో ఆగని స్కై ఇటీవల జరిగిన దేశవాళీ మ్యాచ్‌లలో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఎట్టకేలకు అతడికి సెలక్షన్ కమిటీ నుంచి పిలుపొచ్చింది. ఇంగ్లండ్‌తో వచ్చే నెలలో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది.

శనివారం రాత్రి బీసీసీఐ ప్రకటించిన టీ20 జట్టులో సూర్యకుమార్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాటియాకు కూడా చోటు లభించింది. ఇషాన్‌ గత ఐపీఎల్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడగా, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్‌ తెవాతియా ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు బాది వెలుగులోకి వచ్చాడు. దీంతో వారిని కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. మరోవైపు కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు ఎంపికైనా గాయం కారణంగా తప్పుకున్నాడు. అతడికి ఈ సిరీస్‌లో మరో అవకాశం కల్పించారు.

ఇదిలా ఉంటే ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌.. ఇద్దరు ఎంపికవ్వడంపై ఆ ఫ్రాంఛైజీ సంతోషం వ్యక్తం చేసింది. కృషి, పట్టుదలతో టీమిండియాకు ఎంపికయ్యారని ట్వీట్‌ చేస్తూ వారిని అభినందించింది. మరోవైపు చాలా రోజుల నుంచి ఈ పిలుపు కోసం ఎదురు చూస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు పలువురు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు అభినందనలు చెప్పారు. అతడి నిరీక్షణకు తెరపడిందని, ఎట్టకేలకు భారత జట్టుకు ఎంపికయ్యాడని హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆర్పీసింగ్‌, వసీమ్‌ జాఫర్‌, రమేశ్‌ పవార్‌ తదితరులు ట్వీట్‌ చేశారు.

ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య, పంత్‌, ఇషాన్‌ కిషన్‌, చాహల్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, సుందర్‌, రాహుల్‌ తెవాతియా, నటరాజన్‌, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: