ఇంటర్నెట్ డెస్క్: ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఏళ్ల నిరీక్షణ తరువాత అతడి కల నెరవేరింది. జాతీయ జట్టులో స్థానం లభించింది. ఇంగ్లండ్‌తో జరగబోతున్న టీ20 సిరీస్‌కు  సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు జట్టు సెలెక్షన్ కమిటీ ఇటీవలే తెలిపింది. సుర్యకుమార్ యాదవ్‌తో పాటు ముంబై ఇండియన్స్ యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా, కోల్‌కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను కూడా ఇంగ్లండ్‌తో టీ20లకు సెలక్టర్లు ఎంపిక చేశారు. దీనిపై అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో సెలక్షన్ కమిటీ

అప్పుడెప్పుడో స్కై గురించి చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది.అప్పట్లో ఆసీస్ సిరీస్‌కు స్కైను ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ టాలెంట్‌ ఎవరికీ కనిపించడం లేదని, అతడి టాలెంట్‌కు ఇప్పటికే అద్భుతమైన అవకాశాలు రావాల్సి ఉందని కానీ రాలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అజిత్ గోపాలకృష్ణన్ అనే ఫేస్‌బుక్ యూజర్.. ‘స్కై.. ఈ పేరు గుర్తుంచుకోండి. త్వరలో నీవు ఇండియా క్యాప్ ధరిస్తావు. నిన్ను పక్కన పెట్టినందుకు సెలెక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇలానే ప్రయత్నించు. తలుపు పగలగొట్టు’ అంటూ రాసుకొచ్చాడు. ఆ పోస్టుకు సూర్యకుమార్ యాదవ్ దేశవాళీల్లో సాధించిన టాప్ స్కోరు వివరాలను కూడా జత చేశాడు.

ఈ పోస్టును చూసిన టీమిండియా సెలెక్టర్ కురువిల్లా తన స్టైల్లో స్పందించారు. ‘స్కై కా టైం ఆయేగా(స్కై టైం వస్తుంది)’ అని ఆ పోస్టుకు కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే టీమిండియా-ఇగ్లండ్ మధ్య 5 టీ20ల సిరీస్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మొత్తం మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలోనే జరగనున్నాయి. ఈ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా నిలవనుంది. ఈ నెల 24 నుంచి జరగనున్న ఇండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్‌ ఈ స్టేడియంలో తొలి మ్యాచ్ కానుంది. ఇది డే/నైట్ మ్యాచ్ కూడా కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: