విరాట్ కోహ్లీ... రన్ మెషిన్ అనే పేరు. ఇక టీమ్ ఇండియా సారధిగా అయితే ఎన్నో రికార్డులు ఉన్నాయి. ధోనీ తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా కూడా కోహ్లీకి పేరు. మ్యాచ్ విన్నర్‌ అనే పేరు కూడా కోహ్లీకి ఉండేది. అయితే కొద్ది రోజులుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పరుగులు చేసేందుకు కూడా ప్రస్తుతం కోహ్లీ తీవ్రంగా కష్టపడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌లలో అయితే ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు కూడా. వరుస ఓటములతో కావాల్సినంత చెడ్డ పేరు కూడా మూట గట్టుకున్నారు. దీంతో కోహ్లీపై ఇంటా బయటా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సారధిగా తప్పుకోవాలంటూ కూడా డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో గత నెలలో ముగిసిన ప్రపంచ కప్ ట్వంటీ 20 టోర్నమెంట్ తర్వాత టీ 20 జట్టు సారధ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నారు. న్యూజీలాండ్‌తో జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత కోహ్లీ ఆటపై విమర్శలు వెల్లువెత్తాయి కూడా. దీంతో కోహ్లీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల ఫార్మెట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని కోహ్లీ భావిస్తున్నట్లు సమాచారం.

కేవలం టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు మాత్రమే నిర్వహించేందుకు విరాట్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి... బీసీసీఐకి కోహ్లీ లిఖిత పూర్వకంగా తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే టీ 20 సిరీస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నారు. తాజాగా ముగిసిన న్యూజీలాండ్ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది భారత జట్టు. ఇప్పుడు సౌతాఫ్రికాలో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నెల 26వ తేదీ నుంచి రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఇప్పుడు 20 మంది ప్లేయర్లును పంపేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సిరీస్ నుంచే కెప్టెన్‌ను మారుస్తారా... లేక.. విరాట్ కోహ్లీని కొనసాగిస్తారా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రస్తుతం టీమ్ సెలక్షన్‌పై దృష్టి సారించారు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ. ఈ వారంలోనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. కోహ్లీ కెప్టెన్‌గా ఉంటారా... లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: