ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ 15 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీలో పాల్గొన్న 10 జట్లు ఎంతో పటిష్టంగా ఉండడంతో గెలుపు కోసం అన్ని జట్లు చెమటోడ్చాల్సిన పరిస్థితి. నిన్నటి వరకు అన్ని టీమ్ లు పాయింట్ల పట్టికలో ఖాతాను ప్రారంభించాయి. కేవలం రెండు జట్లు మాత్రమే గెలుపు రుచి చూడలేదు. వాటిలో ఒకటి గత ఐపిఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఇంకొకటి ఐపిఎల్ లో అయిదు టైటిల్ లు సాధించిన ముంబై ఇండియన్స్. ఇరు జట్లు కూడా నాలుగు మ్యాచ్ లు పూర్తి చేసుకున్నా ఇంకా గెలుపు దక్కలేదు. అయితే నిన్నటి మ్యాచ్ తో దాదాపు నాలుగు మ్యాచ్ ల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు రుచి చూసింది.

తన ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ను 23 పరుగుల తేడాతో ఓడించింది. దీనితో పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లు సాధించి 9 వ స్థానంలో నిలిచింది. అయితే ఈ గెలుపు కూడా సాధారణమైన గెలుపు కాదు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఏ జట్టు సాధించని విధంగా చెన్నై సాధించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. మరో సారి గత ఐపిఎల్ హీరో రుతురాజ్ గైక్వాడ్ విఫలం అయ్యాడు. ఇక సమన్వయ లోపం కారణంగా మొయిన్ అలీ రన్ ఔట్ గా వెనుదిరిగాడు. ఇక అప్పుడు వచ్చాడు యంగ్ ప్లేయర్ శివం దుభే. ఇతను ఉతప్పతో కలిసి మూడవ వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ ఒక సునామీని తలపించింది.

అలా నిర్ణీత ఓవర్లలో చెన్నై 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ స్కోర్ రావడంలో శివం ధుభే 96 పరుగులు మరియు ఉతప్ప 88 పరుగులు కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఈ లీగ్ లో ఇదే అత్యధిక టోటల్ స్కోరు కావడం గమనార్హం. ఇక చేజింగ్ లో బెంగళూర్ మొదటి నుండి వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చి చివరకు 9 వికెట్లకు 193 పరుగులు చేసి ఓటమి పాలయింది. చెన్నై బౌలర్లలో తీక్షన 4 మరియు జడేజా 3 వికెట్లు తీశారు. ఈ విజయంతో టోర్నీలో ఉన్న మిగిలిన జట్లకు బలమైన సంకేతాన్ని మరియు వార్నింగ్ ఇచ్చింది చెన్నై జట్టు. ఇక నుండి తగ్గేదేలే అన్నట్లుగా వీరి ప్రదర్శన ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: