ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయస్ధానాల జోక్యం విపరీతమైపోయిందనే వాళ్ళలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా చేరారు. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణ చేయించాలని అనుకుంటే కోర్టు ఎలా అడ్డుకుంటుంది ? అంటూ సూటిగా ప్రశ్నించారు.  ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని ప్రొఫెసర్ స్పష్టంగా చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా తమను ప్రభుత్వం అరెస్టు చేస్తోందని, వేధిస్తోందని ఎవరికైనా అనిపిస్తే బాధితులు కేసులు వేసినపుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాలి తప్ప ఇతరత్రా విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు.




చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో  జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జగన్ ప్రభుత్వం విచారణ జరపటాన్ని హైకోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డాడనే ఆరోపణలపై మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసిబి ఎఫ్ఐఆర్ బుక్ చేయగానే కోర్టు అడ్డుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై అసలు విచారణ జరిపించే హక్కే ఇప్పటి ప్రభుత్వానికి లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. దీన్నే ప్రొఫెసర్ తప్పుపడుతున్నారు. కోర్టు ఇటువంటి తీర్పు చెప్పటం వల్ల ప్రభుత్వాల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోవా అంటూ కోర్టులనే సూటిగా ప్రశ్నించారు.





విచారణలో వ్యక్తుల లేదా ప్రభుత్వాలకు చట్ట, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరిగిందని అభిప్రాయపడినపుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవని అభిప్రాయపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై విచారణనే కోర్టు అడ్డుకుందంటే అసలు అవినీతే జరగలేదని కోర్టు చెప్పదలచుకుందా అంటూ నిలదీశారు. విచారణ జరక్కుండానే అవినీతి జరగలేదని కోర్టు ఎలా అభిప్రాయపడిందనేది ప్రొఫెసర్ లాజిక్కు కోర్టే సమాధానం చెప్పాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేక కొత్త ప్రశ్నలకు కారణాలుగా మారినట్లు ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులో జోక్యం పెరిగిపోతోందనే భావన బలపడిపోవటానికి ఇటువంటి తీర్పులే అవకాశాలు ఇస్తున్నాయన్నారు. ప్రజల అంశాల తరపునే కోర్టులు పోరాడాలి తప్ప రాజకీయపరమైన అంశాల జోలికి వెళ్ళకూడదని చెప్పారు.




ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై విచారణ జరపమంటూ పదే పదే చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలే కదా ప్రభుత్వాన్ని చాలెంజ్ చేశారంటూ ప్రొఫెసర్ టిడిపిని నిలదీశారు. ఒకటికి పదిసార్లు విచారణ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన చంద్రబాబు అండ్ కో తీరా విచారణ మొదలయ్యేటప్పుడు ఎందుకు కోర్టుకెక్కారంటూ నాగేశ్వర్ ఎద్దేవా చేశారు. దమ్ముంటే విచారణ జరపమన్నది టీడీపీనే విచారణ మొదలుపెట్టగానే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నది టీడీపీనే అంటూ చంద్రబాబు గాలితీసేశారు. రాజకీయపరమైన అంశాలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొవాల్సిన టీడిపీ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవటం ఏమిటో అర్ధం కావటం లేదన్నారు. అవినీతి కేసుల్లో జగన్ లాగే చంద్రబాబు కానీ లోకేష్ కానీ జైలుకెళితే తర్వాత లోకేష్ ముఖ్యమంత్రవటం ఖాయమని ప్రొఫెసర్ జోస్యం కూడా చెప్పారు. జగన్ కూడా జైలుకెళ్ళి వచ్చిన తర్వాతే సిఎం అయిన విషయాన్ని ప్రొఫెసర్ గుర్తుచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: