ఏపీలో మొన్న ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమం ఫోటోలు, ఫుటేజ్‌ బాగా వైరల్ అయ్యాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో ధర్నా, ఆందోళనలు జరగడం దాదాపు ఇదే తొలిసారి. విపక్షం తెలుగు దేశం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఇంత స్పందన కనిపించలేదు.


ఈ స్పందన, ఫోటోలు, వీడియోలు చూసి టీడీపీ అనుకూల మీడియాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఇక ఆంధ్రజ్యోతి ఆర్కే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా.. ఆయన ఇక తన కొత్త పలుకు వ్యాసంలో రెచ్చిపోయారు.. చూసుకో.. జగన్.. ఇక నీ పని అయిపోయింది.. నీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.. నీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.. ఇందుకు ఈ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడమే ఉదాహరణ అంటూ రాసుకొచ్చారు.


అంతేకాదు.. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందని.. ఇకనైనా జగన్ ఈ విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ ఈ విషయం తెలుసుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో జనం ఘోరంగా ఓడిస్తారని ఆర్కే రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ సెటైర్‌ కూడా వేసారు.
జగన్ ఎప్పుడూ జనంలోకి రారని చెబుతున్న ఆర్కే.. అధికారం కోసం జగన్ చేసిన పాదయాత్ర తాలూకు నొప్పులు ఇంకా తగ్గినట్టు లేవు అంటూ సెటైర్ వేశారు.


సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచుతున్న జగన్‌రెడ్డి తమ కడుపు కొట్టడం ఏమిటంటూ ఉద్యోగులు రగిలిపోతున్నారట. దీనికి జనం కూడా మద్దతు ఇచ్చారరట. అందుకే పోలీసులు ఆంక్షలు పెట్టినా చలో విజయవాడ అంతగా విజయవంతం అయ్యిందట. ఇది ఎమర్జెన్సీని సైతం ఎదిరించి నిలబడ్డ దేశమని.. జగన్‌ రెడ్డి వినాశకర విధానాలు, నియంతృత్వ పోకడలను ఎదుర్కొనేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఈ పరిణామాలు చెబుతున్నాయని ఆర్కే విశ్లేషిస్తున్నారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు రావాలని..  క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హితవు పలికారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డికి ఇంకా కాళ్లనొప్పి తగ్గినట్టు లేదని సెటైర్‌ వేశారు. అందుకే మూడేళ్లు అయినా తాడేపల్లి ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని జోకేశారు ఆర్కే.

మరింత సమాచారం తెలుసుకోండి: