సుందరమైన మధురై నగరం, దక్షిణ భారతదేశంలోని ఒక గొప్ప పుణ్య క్షేత్రం. తమిళ సంస్కృతికి పుట్టినిల్లు. పవిత్ర వైగైనదీ తీరాన ఉంది. మీనాక్షీ, సుంద రేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది. సుందరేశ్వరుడు సాక్షాత్తు శివుడు, ఆయన భార్య సాక్షాత్తు పార్వతీ దేవి. ఈ సుందర నగరాన్ని కవీశ్వరులు, గాయకులు దివ్యమైనదిగా గానం చేశారు. శక్తి స్వరూపిణి అయిన దేవి, మానవ రూపంలో అవతరించి పాండ్య రాజ పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి, భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి, పరమ శివుని సతీమణి అయింది. 

 

తమిళ గ్రంథం తిరువవిలై యాతర పురాణంలోని కథనం ప్రకారం.. ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు చాలా కాలం వరకూ సంతానం కలగలేదు. దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలిసి పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. అయితే ఆయనకు పుత్రునికి మారుగా అప్పటికే మూడేళ్ల వయసున్న ఒక పుత్రిక జన్మించింది. ఆమెకు మూడు రొమ్ములు ఉన్నాయి. ఇదేమిటా అని తల్లి తండ్రులు ఆలోచిస్తున్నంతలో శివుడు ప్రత్యక్షమై ఆమెను కొడుకు మాదిరి పెంచమని ఆమె తన భర్తను కలిసిన మరుక్షణం మూడవ రొమ్ము మాయమవుతుందని చెప్పాడు. 

 

తల్లితండ్రులు ఆమెకు పుత్రుని మాదిరి యుద్ధ విద్యలు నేర్పించారు. వాటిలో ఆమె ప్రావీణ్యం గడించింది. రాజ్యాలను గెలుచుకుంది. ఒక రోజు ఆమె ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని దర్శించగానే ఆమె మూడవ రొమ్ము మాయమైంది. దానితో ఆయనే తన భర్త అని ఆమె గ్రహించింది. పార్వతీ దేవి మరో రూపమైన ఆమెను శివుడు వివాహమాడాడు. వారిద్ద్దరూ కొంత కాలం మధురై నగరాన్ని పాలించారు. 

 

ఆ తర్వాత వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి ఉగ్ర పాండ్యన్‌ అని పేరు పెట్టారు. ఇతనిని మురుగన్‌ (కుమారస్వామి ) అపర అవతారంగా పేర్కొంటారు. వారు అతనిని సింహాసనంపై కూర్చోపెట్టి తాము సుందరేశ్వర మీనాక్షిలుగా.. దైవాలుగా ఆలయంలో కొలువు తీరారు. పేరెన్నికగన్న మధురై మీనాక్షి ఆలయం ప్రస్తావన 6వ శతాబ్దానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో కనిపిస్తుందని అంటారు. ఈ ఆలయం ప్రాచీన గ్రంథాల్లో ఉన్నా, 14వ శతాబ్దం అనంతరమే ప్రస్తుత ఆలయం నిర్మాణం జరిగిందని చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: