
ఐపీఎల్‌లో ‘నోట్ బుక్ సెలబ్రేషన్’ తో చర్చనీయాంశంగా మారిన లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాథి పై నిషేధం విధించడం అన్యాయమని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. IPLలో తొలి సంవత్సరం ఆడుతున్న యువ క్రికెటర్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించడం కొంచెం కఠినంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఇది అతడి (దిగ్వేశ్) తొలి ఐపీఎల్ సీజన్. అలాంటప్పుడు అతన్ని ఓ సందర్భంలో రీ యాక్షన్ ఇచ్చినందుకు నిషేధించడాన్ని నేను సమర్థించను. గతంలో ఎంఎస్ ధోనీ గ్రౌండ్‌లోకి వచ్చి అంపైర్‌తో వాదించాడు. అతనిపై నిషేధం లేదు. కోహ్లీ కూడా చాలా సార్లు అంపైర్లతో దురుసుగా ప్రవర్తించాడు. కానీ, అతనిపై ఎప్పుడూ నిషేధం లేదు. అలాంటి పరిస్థితిలో దిగ్వేశ్‌కి మాత్రం నిషేధం విధించడం అన్యాయంగా భావిస్తున్నానని సెహ్వాగ్ వ్యాఖ్యానించారు.
ధోనీ 2019లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక నో బాల్ విషయంలో అసంతృప్తిగా భావించి నేరుగా గ్రౌండ్‌లోకి వచ్చి అంపైర్లతో వాదించాడు. కానీ, అతనిపై కేవలం 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా మాత్రమే విధించబడింది. నిషేధం విధించలేదు. అలాగే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కోహ్లీ గతంలో ఎన్నో సార్లు ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గంభీర్‌తో కూడానూ ఘర్షణకు దిగాడు. అయినప్పటికీ, అతనిపై ఎప్పుడూ సస్పెన్షన్ విధించలేదు. ఇది BCCIలో ద్వంద్వ ధోరణులకు ఉదాహరణ అని మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యల ద్వారా సెహ్వాగ్ బీసీసీఐ వ్యవహార శైలిపై గట్టిగా ప్రశ్నలు వేశారు. ఒకవైపు యువ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటూ, మరోవైపు స్టార్ ఆటగాళ్లకు మాత్రం సడలింపులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా గా చెప్పాలంటే, దిగ్వేశ్ రాథిపై విధించిన నిషేధం అనవసరమని సెహ్వాగ్ స్పష్టంగా పేర్కొంటూ, క్రికెట్ పాలక సంస్థలు సమాన న్యాయం పాటించాలని సూచించారు. చూడాలి మరి ఇక ఉండైన బీసీసీఐ తన పద్దతిని మార్చుకుంటుందో లేదో మరి.