పెహ‌ల్గాంలో అమాయ‌క పర్య‌ట‌కుల‌ను బలిగొన్న ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా నిలిచిన పాకిస్థాన్ కు, ఆసియా కప్ లో టీమ్ ఇండియా గట్టి బుద్ధి చెప్పింది. అస‌లు ఈ టోర్నీ లో మేము ఆడేది లేద‌ని ముందే తేల్చి చెప్పిన బీసీసీఐ, క్రికెట్ ప్రేమికుల కోసమే కాస్త మెత్త‌బ‌డి ఆడింది. కానీ, అది కేవ‌లం క్రికెట్ మైదానంలో గెలిచేందుకే గాని, పాక్ ఆటగాళ్ల‌తో స్నేహం చేసేందుకేమీ కాదు. వరుసగా మూడు మ్యాచ్ లలోనూ భారత్ గెలిచి పాక్ మొహం మాడ్చేసింది. మ్యాచ్ ముగిసిన తరువాత కూడా ఒక్కసారి కూడా షేక్ హ్యాండ్ చేయకుండా, వారిని గట్టిగానే ఇబ్బంది పెట్టింది. సూపర్ 4లో ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ తుపాకీ కాల్పులు చేస్తున్నట్టు సంబరాలు చేసుకోవడం, పేసర్ హారిస్ రవూఫ్ యుద్ధవిమానాలు కూల్చినట్టు అరిచేయడం.. ఇవన్నీ పాకిస్థాన్ క్రికెట్ అసలైన మానసిక స్థితిని బయటపెట్టాయి.
 

దీంతోనే రవూఫ్ కు 30% జరిమానా, ఫర్హాన్ కు హెచ్చరికలు వచ్చాయి. ఫైనల్ లో మరోసారి షాక్ ఎదురైన పాక్ జట్టు చివరికి నిశ్శబ్దంగా కూర్చోవాల్సి వచ్చింది. అయితే అసలైన డ్రామా ఫైనల్ ముగిసిన తర్వాతే జరిగింది. సాంప్రదాయం ప్రకారం ఏసీసీ అధ్యక్షుడు ట్రోఫీని అందించాలి. ఈసారి ఆ హోదాలో ఉన్నది పాక్ మంత్రి, పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ. ఆయన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడాన్ని టీమ్ ఇండియా ఘాటుగా నిరాకరించింది. అందుకే మ్యాచ్ 10.30కే ముగిసినా, 11.45 వరకు ప్రెజెంటేషన్ ప్రారంభం కాలేదు. చివరికి కప్ లేకుండానే భారత ఆటగాళ్లు గ్రౌండ్ లో చేతులు పైకెత్తి సంబరాలు జరుపుకున్నారు. నఖ్వీ ప్రవర్తనకే ఇది రిటర్న్ గిఫ్ట్ లాంటిది. ఎందుకంటే, ఆయన విజేత జట్టుకు కప్ అందించేందుకు కూడా తన స్థానాన్ని వదిలి రావడానికి సిద్ధం కాలేదు.

 

దీంతో ట్రోఫీని అక్కడినుంచి తీసేయాల్సి వచ్చింది. ఇక పాక్ జట్టుకి రన్నరప్ ట్రోఫీని బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం ఇచ్చారు. మన ఆటగాళ్లు మాత్రం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తిలక్, సిరీస్ బెస్ట్ అభిషేక్ శర్మ, 17 వికెట్లు తీసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలిచిన కుల్దీప్ యాదవ్ తమ బహుమతులను స్పాన్సర్ల నుంచి తీసుకున్నారు. మొత్తానికి షేక్ హ్యాండ్ కాదంటూ మొదలైన ఈ సైలెంట్ వార్, చివరికి ట్రోఫీ తీసుకోకుండా ముగిసింది. పాక్ కు మిగిలింది రన్నరప్ అవమానం మాత్రమే. ఇదే అసలైన ఫినిషింగ్ టచ్ ఇచ్చిన టీమ్ ఇండియాకు బీసీసీఐ రూ.21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఆసియా కప్ కేవలం టైటిల్ గెలవడమే కాదు.. పాక్ కు రాజకీయంగా, క్రీడా రంగంలోనూ గట్టి చెంపదెబ్బ కొట్టిన మర్చిపోలేని టోర్నీగా నిలిచిపోయింది. మొత్తానికి ఆసియా కప్ 2025.. పాక్ కు గర్వభంగం, భారత్ కు ఘనవిజయం!

మరింత సమాచారం తెలుసుకోండి: