భారత్‌కు మూడో ఫైనల్ – సఫారీలకు చరిత్రాత్మక అవకాశం:
దక్షిణాఫ్రికా మహిళా జట్టుకు ఇది తొలి ప్రపంచకప్ ఫైనల్. ఇక టీమిండియాకు ఇది మూడో ఫైనల్ అవుతోంది. 2005లో ఆస్ట్రేలియాతో, 2017లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు ఫైనల్స్‌లో భారత్ కేవలం ఒక అడుగు దూరంలో ట్రోఫీని చేజార్చుకుంది. ఆ జ్ఞాపకాలు ఇంకా అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈసారి మాత్రం ఎలాగైనా చరిత్ర సృష్టించాలని, ప్రపంచకప్‌ను గెలిచి కొత్త యుగాన్ని ప్రారంభించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ దాకా దూసుకెళ్లింది. మరోవైపు, లారా వోల్వార్ట్ కెప్టెన్సీలో సఫారీ జట్టు కూడా అప్రతిహతంగా ఆడుతూ మొదటిసారిగా ఫైనల్‌కి చేరింది. ఇరుజట్లూ అత్యుత్సాహంతో, తలపడటానికి సిద్ధంగా ఉన్నాయి.
వరుణుడి అంతరాయం – ఫైనల్‌పై వాన ముప్పు:
అయితే, అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కలల పోరుకు వర్షం పెద్ద ముప్పుగా మారే అవకాశముంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఆదివారం ముంబైలో వర్షపాతం సంభవించే అవకాశం 25 శాతం ఉందని తెలిపింది. రాత్రి 8 గంటల వరకూ కూడా సుమారు 20 శాతం వర్ష సూచన ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఈ టోర్నీలో లీగ్ దశలో పలు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి, కొన్ని మ్యాచ్‌లు రద్దయిన విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఫైనల్ రోజున కూడా అలాంటి పరిస్థితి తలెత్తితే మాత్రం ఉత్కంఠ మరింత పెరగడం ఖాయం.
ఏమవుతుంది వర్షం పడితే?
ఫైనల్ రోజున వర్షం కారణంగా ఆట నిలిచిపోతే, మొదటగా అంపైర్లు ఓవర్లను తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తారు. కనీసం ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడే అవకాశం లభిస్తేనే ఫలితం నిర్ణయించబడుతుంది. 20 ఓవర్ల ఆట కూడా పూర్తవకపోతే మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా వేస్తారు.
రిజర్వ్ డే కూడా వర్షం అయితే..?
అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇదే — రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తవకపోతే ఏం జరుగుతుంది? అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నియమాల ప్రకారం, ఫైనల్ రోజూ, రిజర్వ్ డే రోజూ కూడా మ్యాచ్ జరగకపోతే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు, మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టుకే ఛాంపియన్ టైటిల్ దక్కుతుంది. ప్రస్తుతం లీగ్ దశలో భారత్ అత్యుత్తమ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచిన నేపథ్యంలో, రెండు రోజులు వర్షం కారణంగా ఆట జరగకపోతే ట్రోఫీ భారత్ చేతుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టూ సమాన శక్తితో పోరాడినందున, వాతావరణం కారణంగా ఫలితం తేలిపోవడం అభిమానులకు నిరాశ కలిగించవచ్చు.
అభిమానుల ప్రార్థనలు – "వాన కురవకూడదు":
అక్కడ ఇప్పటికే వరుణుడు ఆటపట్టిస్తుండడంతో అభిమానులు సోషల్ మీడియాలో “దయచేసి వాన పడకూడదు, మ్యాచ్ పూర్తిగా జరగాలి” అంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే, ఈ ఫైనల్‌లో ఏ జట్టు గెలిచినా కొత్త చరిత్ర రాయబోతుంది. కాబట్టి క్రికెట్ అభిమానులందరికీ ఇది ఒక కలల పోరాటం.
వర్షం ముప్పు ఉన్నా, రెండు జట్లు కూడా విజయం కోసం సిద్ధంగా ఉన్నాయి. భారత్‌కు కప్‌ను గెలిచి దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలనే తపన ఉంది. మరోవైపు, దక్షిణాఫ్రికా మహిళా జట్టుకు తొలి చాంపియన్‌గా నిలిచే అరుదైన అవకాశం దక్కింది. అయితే, ఈ కలల ఫైనల్‌ను వరుణుడు పాడు చేయకూడదని ప్రతి అభిమాని ఆకాంక్ష. ఆదివారం ఆకాశం మబ్బులతో కమ్ముకున్నా, అభిమానుల ఆశలు మాత్రం మబ్బుల్లా కరుగవు. కాబట్టి...వర్షం ఆగిపో, క్రికెట్ సాగిపో — ఇదే ఇప్పుడు ప్రతి క్రీడాభిమాని మనసులో నినాదం..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి