భారతదేశం అంటేనే ఆచారాల, సంప్రదాయాల ఖజానా. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశంలో ప్రతి జాతి, ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం తనకంటూ ప్రత్యేకమైన విశ్వాసాలు కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని కాలంతో మారిపోతే, మరికొన్ని మాత్రం శతాబ్దాలుగా అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి ఆశ్చర్యకరమైన ఆచారం ఒకటి విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో నేటికీ కొనసాగుతోంది. ఇక్కడి ఆర్యవైశ్యుల వివాహాల్లో ఒక విచిత్రమైన నియమం పాటిస్తారు - పెళ్లి ఊర్లో జరుగుతుంది, కానీ మంగళసూత్రం మాత్రం ఊరి బయట కడతారు! వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా? కానీ ఇది ఆ ఊరి ప్రజలకు సాధారణ విషయం. ఈ ఆచారం వెనుక ఉన్న కారణం మాత్రం ఒక దేవత శాపంతో ముడిపడి ఉందని చెబుతారు.


స్థానికుల వివరాల ప్రకారం - శృంగవరపుకోట గ్రామ దేవత ‘ఎరుకమ్మ పేరంటాలు’ శాపం వల్లే ఈ సంప్రదాయం పుట్టుకొచ్చిందట. ఆ కాలంలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఆ దేవత ఆగ్రహించి “ఈ ఊరిలో తాళి కట్టరాదు” అని శపించిందట. అప్పటి నుంచి ఆ ఊరి ఆర్యవైశ్య కుటుంబాలు ఎవరూ ఆ నియమాన్ని అతిక్రమించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి పెళ్లి అదే విధంగా జరుగుతుంది - పెళ్లి వేడుక ఊర్లో, తాళి మాత్రం ఊరి పొలిమేర అవతల! పెళ్లి కార్యక్రమంలో వధూవరులను కల్యాణ మండపంలో కూర్చోబెట్టి అన్ని పూజలు, భోజనాలు ఊర్లోనే నిర్వహిస్తారు. కానీ ముహూర్తం దగ్గరపడగానే.. వధూవరులను ఊరి సరిహద్దు దాటి తీసుకెళ్లి అక్కడే మంగళసూత్రం కడతారు. తాళి కట్టిన తర్వాత మళ్లీ వధూవరులు ఊరికి తిరిగి వచ్చి మిగతా తంతు పూర్తిచేస్తారు.



పాత తరం ప్రజల మాటల్లో - “ఇది భయంతో పాటించే ఆచారం కాదు, ఇది మన సంప్రదాయం పట్ల గౌరవం, దేవత పట్ల విశ్వాసం” అంటారు. ఈ ఆచారం వలన పెళ్లికి వచ్చిన వారికి కొత్త అనుభవం కలుగుతుందని కూడా చెబుతున్నారు. గతంలో ప్రతి పెళ్లిలో ఈ పద్ధతి తప్పనిసరిగా పాటించేవారు. అయితే ఇప్పుడు కొంతమంది మాత్రం ఊరి అవతలే మొత్తం పెళ్లి కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నారు. అయినా చాలామంది ఆర్యవైశ్య కుటుంబాలు ఇప్పటికీ ఆ పాత ఆచారాన్ని విడిచిపెట్టలేదు. “ఇది కేవలం పద్ధతి కాదు, మా సంస్కృతిలో భాగం” అంటున్నారు స్థానికులు. ఈ కథ విన్నవారెవరైనా ఒక మాట చెబుతారు - భారతదేశం అంటే ఆచారాల అద్భుత తరం! విజయనగరంలోని ఈ ఆచారం అందులోని మరో బంగారు పుట మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: