రాష్ట్ర ప్ర‌జ‌లు నిరంత‌రం అభ‌ద్ర‌త‌, భ‌యంతో జీవిస్తున్నార‌ని, ప్ర‌స్తుత పోలీసుల ప‌నితీరు రాబోయే రోజుల‌కు బ్లాక్ మార్క్‌గానిలిచిపోతోంద‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. విశాఖ‌లో వివాహానికి హాజ‌ర‌య్యేందుకు వెళ్లిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ను అరెస్ట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై నిర‌స‌న తెలియ‌జేసి త‌హ‌శీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చిన చింత‌మ‌నేనిని త‌ప్పుడు కేసుల‌తో ఎలా అరెస్ట్ చేస్తార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. నిర‌స‌న ద్వారా అస‌మ్మ‌తిని తెలియ‌జేయ‌డం, ప్ర‌జా స‌మస్య‌లు ప్ర‌భుత్వ దృష్టికి తీసుకురావ‌డం త‌ప్పా? చ‌ట్ట‌విరుద్ధ‌మా? అని నిల‌దీశారు. రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ‌క‌న్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేప‌తి పోలీస్‌రాజ్ వ్య‌వ‌స్థే క‌న‌ప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. తెలుగుదేశం పార్టీ నేత‌ల అక్ర‌మ అరెస్ట్‌లు, గృహ‌నిర్భందాలు స‌రికాద‌ని, ప్ర‌భుత్వానికి అస‌మ్మ‌తిని తెలియ‌జేస్తే వేధించ‌డం స‌రికాద‌న్నారు. పోలీస్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల్లో గౌర‌వం క‌లిగేలా డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ చంద్ర‌బాబునాయుడు ఆయ‌న‌కు ఒక లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp